అప్పడు సచివాలయానికి..ఇప్పుడు అసెంబ్లీకి డుమ్మా

Update: 2024-07-29 06:00 GMT

కెసిఆర్ ఇక అంతేనా. పవర్ లో ఉంటే సచివాలయానికి రారు. ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీ కి రారు. ఇదేమని ఎవరైనా అడిగితే..అది అధికార పార్టీ అయినా సరే కూడా మీకు మేము చాలు అని చెపుతున్నారు బిఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ వేదికగా. కాసేపు అదే నిజం అనుకుందాం. మరి అలాంటప్పుడు మరి కెసిఆర్ ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఎందుకు తీసుకున్నట్లు?. క్యాబినెట్ హోదా ఎందుకు అనుభవిస్తున్నట్లు. వీటికి బిఆర్ఎస్ నాయకుల దగ్గర సమాధానం ఉండదు అనే చెప్పాలి. చూస్తుంటే కెసిఆర్ కు సీఎం పదవి అయినా..ప్రతిపక్ష నాయకుడి పదవి అయినా అప్పటిలో ప్రగతి భవన్/ ఫార్మ్ హౌస్...ఇప్పుడు ఇంట్లో కూర్చోవటానికి ఇచ్చినట్లే ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కెసిఆర్ ఒకసారి స్పీకర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేయటానికి...మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే సభకు హాజరు అయ్యారు. తర్వాత మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని బడ్జెట్ పై చీల్చి చెండాడుతాం అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆయన అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడటం లేదు.

                                           ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు ఉండేదే అతి తక్కువ రోజులు. వీటికి కూడా హాజరు కాకుండా కెసిఆర్ ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఎలా పోషిస్తారు అన్న చర్చ తెర మీదకు వస్తోంది. అధికారంలో ఉండగా పాలన అంతా అనధికారికంగా కేటీఆర్ కు అప్పగించారు అనే ప్రచారం జరిగింది. బిఆర్ ఎస్ జమానాలో కీలక నిర్ణయాలు అన్ని ..ఏ శాఖలో అయినా అటు కెసిఆర్, ఇటు కేటీఆర్ దృష్టిలో లేకుండా ముందుకు సాగలేదు అని ఆ పార్టీ నాయకులే చెపుతారు. ఇప్పుడు కూడా కెసిఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదా మాత్రం ఆయన తీసుకుని...అసెంబ్లీ లో మాత్రం ఈ పాత్ర పోషించే బాధ్యతను కొడుకు కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లకు అప్పగించినట్లు ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కెసిఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టె రోజు సభకు హాజరు అయ్యారు అని...మళ్ళీ ఆరు నెలల వరకు ఆయన ఇటు వైపు చూసే అవకాశం లేదు అనే చర్చ బిఆర్ఎస్ వర్గాల్లోనే ఉంది.

                                                             కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలతో పాటు విద్యుత్ ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతిపై కూడా విచారణ కమిషన్ లు వేసిన విషయం తెలిసిందే. కెసిఆర్ సభకు వస్తే ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ నుంచి కెసిఆర్ కు గత పాలనకు సంబదించిన అంశాలపై పలు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఆయన సభకు దూరంగా ఉంటూ వస్తున్నారు అని..దీన్ని కవర్ చేయటానికే కేటీఆర్, హరీష్ రావు తదితరులు తాము చాలు అంటూ చెపుతున్నారు అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉండగా సెక్రటేరియట్ కు రాకుండా..ఇప్పుడు ఉండే అతి తక్కువ రోజులు కూడా అసెంబ్లీ కి రాకుండా ఉన్న కెసిఆర్ తీరు వాళ్ళ రాజకీయంగా బిఆర్ఎస్ కు చిక్కులు తప్పవని చెపుతున్నారు. రాజకీయంగా ఈ అంశాన్ని అధికార కాంగ్రెస్ వాడుకోవటం ఖాయం.

Tags:    

Similar News