తెలంగాణ క్యాబినెట్ లాక్ డౌన్ ను మరో పది రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించింది. అయితే ఇది పూర్తిగా రాత్రి కర్ఫ్యూ మాత్రమే. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ సడలింపులు ఇచ్చారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి, నకిరేకల్ మినహా మిగతా జిల్లాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ కొనసాగిస్తారు. మంగళవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ సారధ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా క్రమంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అన్ లాక్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. తెలంగాణ కూడా అదే బాటలో పయనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా షాపులు, ఇతర వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఐదు గంటలకే మూసివేయాలి. ఇళ్లకు వెళ్లేందుకు గంట పాటు వెసులుబాటు కల్పించారు. జూన్ నుంచి మరో పది రోజుల పాటు రాత్రి పూట లాక్ డౌన్ అమలు కానుంది.