తెలంగాణ మంత్రుల మేడిగడ్డ పర్యటన..ఈ పర్యటనలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక..సాగునీటి శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అయన వ్యవహరిస్తున్న తీరు కొంత మంది కాంగ్రెస్ నేతలకు కూడా అంతు చిక్కటం లేదు. ఎంత సేపు ఈ ప్రాజెక్ట్ లో వైఫల్యాలకు భాద్యులు అయిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ జనరల్ స్టేట్ మెంట్ ఇస్తూ వస్తున్నారు తప్ప అయన గత కెసిఆర్ సర్కారు పై విమర్శలు చేయకపోవటం పలు అనుమానాలకు కారణం అవుతోంది. అదే సమయంలో మేడిగడ్డ సందర్శన సందర్భంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న అక్రమాలు...మోసాలపై మాట్లాడుతుంటే...మధ్యలో ఉత్తమ్ ఆయన్ను ఆపించి తర్వాత మళ్ళీ మాట్లాటదాం అని చెప్పటం కూడా హాట్ టాపిక్ గా మారింది. 2022 జులైలో వచ్చిన వరదలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని బాహుబలి మోటార్లు మునిగిపోయి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా దీనికి అయ్యే ఖర్చు అంతా కంపెనీనే భరిస్తుంది అంటూ బిఆర్ఎస్ మంత్రులు చెపుతూ వచ్చారు. ఇప్పుడు ఈ మోటార్లకు సంబంధించి నిర్మాణ మెగా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ బిల్స్ పెడితే అవి ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చేరాయని పొంగులేటి వెల్లడించారు. ఈ బిల్స్ ఇంజినీర్లు పెట్టారా...లేక ఎవరైనా పై నుంచి పెట్ట మంటే పెట్టారా అని కూడా పొంగులేటి ప్రశ్నించారు. కాళేశ్వరం మోటార్లకు బిల్స్ పెట్టారు అంటే ప్రజలను మోసం చేసేందుకు గత ప్రభుత్వ పెద్దలు అబద్దాలు చెప్పినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే బయటకు చెప్పేది ఒకటి..లోపల చేసేది మరొకటి. అందుకు జీఓ లతో సహా ఏమి బయటకు రాకుండా బిఆర్ఎస్ రహస్య పాలనా సాగించింది. ప్రభుత్వం మారటంతో ఇప్పుడు ఒక్కో విషయం బయటకు వస్తోంది.
వాస్తవానికి ఇలాంటి విషయాలు ప్రజలకు చెప్పాల్సింది సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ఇంతటి కీలక విషయాలు అయన చెప్పకుండా..చెపుతున్న మంత్రిని కూడా ఆపటం అన్నది పలు అనుమానాలు కారణం అవుతోంది. మేడిగడ్డ లో పర్యటించిన మంత్రుల్లో ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప అందరూ కెసిఆర్ సర్కారుపై ఏదో ఒక రూపంలో పెద్ద ఎత్తున ఎటాక్ చేశారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కెసిఆర్ ను రక్షించేందుకు ప్రయతిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ఈ ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహించిన సమయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) టార్గెట్ చేశారు కానీ..ఈ తప్పులకు కారణం అయిన వారిపై...డిజైన్లు ఆమోదించిన వారిపై మాత్రం పెద్దగా మాట్లాడలేదు. ఇందులో ఎల్ అండ్ టి తప్పు ఉంటే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవద్దు అని ఎవరూ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంపై జ్యూడిషల్ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్నిసార్లు సమీక్షలు నిర్వహించి కూడా ఇప్పటివరకు మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత ఎల్ అండ్ టి పై ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించటం లేదు. తమకు బాధ్యత లేదు అని ...అదనపు చెల్లింపులు చేస్తేనే పనులు చేస్తామని కంపెనీ లేఖ రాసిన విషయం తెలిసిందే. వై ఎస్ హయాంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో అప్పటి హోసింగ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చర్యలు తీసుకుంటామని మాజీ సీఎం కెసిఆర్ ఎన్నికల ప్రచార సభల్లో బహిరంగంగానే ప్రకటించారు. కానీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన పూర్తి అయింది కానీ ఈ దిశగా అడుగు ముందుకు పడలేదు. ఇందుకు ప్రతిఫలంగానే ఉత్తమ్ మేడిగడ్డ విషయంలో కెసిఆర్ అండ్ కో పై సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కీలక విషయాల్లో ప్రజలకు క్లారిటీ ఇవ్వకుండా మంత్రి మౌనం పాటించటం అనుమానాలు పెరగటానికి కారణం అవుతోంది.