తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్స్ లను అడ్డుకోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అధికారంతో ఇలా చేశారని ప్రశ్నించింది. ఇంతటి విపత్తు వేళ అంబులెన్స్ లను అడ్డుకోవటం మానవత్వమేనా? అని ప్రశ్నించింది. హైకోర్టు పలుమార్లు కరోనా పరీక్షలు పెంచాలని చెప్పినా..ఇంకా తగ్గిస్తారా అంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలా అయితే అధికారులు కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు అత్యవసరంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై విచారణ చేపట్టింది.
పాతబస్తీలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదన్న న్యాయస్థానం.. లాక్‌డౌన్ విధిస్తారా లేదా నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు స్పందించిన అడ్వకేట్ జనరల్.. మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉందని, సమావేశం అనంతరం లాక్‌డౌన్, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చెప్పే విషయాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన ఉండటంలేదన్నారు. మీడియా జరిగే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తోందని వ్యాఖ్యానించారు.