తెలంగాణ హైకోర్టు బుదవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ భూముల విక్రయాన్ని ఆపాలంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ సందర్భంలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ప్రభుత్వం తరపున వాదనలు విన్పించిన అడ్వకేట్ జనరల్ నిధుల సమీకరణతోపాటు కబ్జాలకు గురయ్యే అవకాశం ఉన్నందునే వేలం వేస్తున్నట్లు కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక, అమ్ముకోవడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అదే సమయంలో కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల అమ్మకానికి అనుమతి ఇచ్చింది.
అయితే జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూబ్యాంక్ ఏర్పాటుపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. భూముల అమ్మకాన్ని ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని, జీవో 13ను కొట్టివేయాలని బిజెపి నాయకురాలు విజయశాంతి హైకోర్టును ఆశ్రయించారు. కోకాపేట, ఖానామెట్ భూముల వేలం గురువారం నాడే సాగనుంది. ఈ భూముల విక్రయం ద్వారా భారీ ఎత్తున నిధుల సమీకరణపై సర్కారు ఆశలు పెట్టుకుంది.