మెడ‌పై క‌త్తి పెట్టి అయినా డ‌బ్బులు వెన‌క్కి ఇప్పించాలి

Update: 2021-06-02 14:23 GMT

తెలంగాణ హైకోర్టు ప్రైవేట్ ఆస్ప‌త్రుల తీరుపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. క‌రోనా చికిత్స లైసెన్స్ లు ర‌ద్దు చేయ‌టం కంటే..బాధితుల నుంచి వ‌సూలు చేసిన అధిక మొత్తాల‌ను వారికి వెన‌క్కి ఇప్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. అదే స‌మ‌యంలో తాజాగా క‌రోనా చికిత్స‌కు సంబంధించి ధ‌ర‌లు నిర్ణ‌యిస్తూ జీవో జారీ చేయాల‌ని..ఆ జీవోను వెబ్ సైట్ లో పెట్టాల‌ని హైకోర్టు కోరింది.తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో బుధ‌వారం నాడు మ‌రోసారి విచారణ సాగింది. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని కోర్టు ప్ర‌శ్నించ‌గా..అందుకు సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ హైకోర్టుకు తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఇప్పటివరకు 174 ఫిర్యాదులొచ్చాయని డైర‌క్ట‌ర్ ఆఫ్ హెల్త్ తెలిపారు. వాటిలో 113 ప్రైవేట్‌ ఆస్పత్రులకు నోటిసులిచ్చామని, 20 ఆస్పత్రుల లైసెన్స్‌లు రద్దు చేశామన్నారు.

ఆర్‌టీపీసీఆర్ టెస్టుల కోసం 6 ల్యాబ్ ఏర్పాటు చేశామని, మిగితా 8 ల్యాబ్ ల‌ను జూన్ 10 వరకు సిద్ధం చేస్తామని డీహెచ్‌ హైకోర్టుకు తెలియజేశారు. మూడో దశ కరోనా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుంది అనడానికి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్స్ లైసెన్స్ రెన్యువ‌ల్స్ పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటేనే లైసెన్స్‌లను రెన్యువ‌ల్ చేస్తామన్నారు. ప్రభుత్వం పాశ మైలారంలో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తయారు చేస్తుంద‌ని తెలిపారు. అధికంగా వ‌సూలు చేసిన ఫీజులు వెన‌క్కి ఇవ్వ‌క‌పోతే ఆస్ప‌త్రి లైసెన్స్ లు ర‌ద్దు చేస్తామ‌ని చెప్పాల‌న్నారు.

Tags:    

Similar News