తెలంగాణ హైకోర్టు మరోసారి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాత్రి కర్ఫ్యూ ఒక్కటే సరిపోదని, పగలు కూడా జనం గుమిగూడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించాలని కోర్టు సూచించింది. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలపై పటిష్ట చర్యలు తీసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాహాది వేడుకలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ జనాలు ఉండకుండా చూడాలని కోర్టు సూచించింది. ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకున్నా ప్రతి హాస్పిటల్ అడ్మిషన్ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. శుక్రవారం నాడు విచారణ సందర్బంగా రోజుకు 30 నుంచి 40 వేల ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో కోర్టు ''ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 3,47,000 టెస్టులు మాత్రమే టెస్టులు చేశారు.. కానీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 8,40,000 టెస్టులు చేయాలి.
ఎందుకు చేయడం లేదు'' అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ''యాదాద్రి భువనగిరి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి ఏరియాలో చాలా కేసులు నమోదు అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో టెస్టులు పెంచాలి. వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. వారు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 'ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, నేషనల్ హైవే ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా 13,50,108 అంబులెన్స్ ఉన్నాయి.. అందులో కాల్స్ రాగానే 450 మాత్రమే వెళ్తున్నాయి. 108,104 టోల్ ఫ్రీ నెంబర్స్ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్ వద్ద డిస్ప్లే బోర్డ్ ఏర్పాటు చేయాలి'' అని హైకోర్టు ఆదేశించింది.