జంట నగరాల తాగునీటికి సంబంధించి అత్యంత కీలకమైన గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన జీవో 111 రద్దు అయింది. ఈ జీవోను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ జీవో ఏప్రిల్ 12నే జారీ అయినా..ఇది ఏప్రిల్ 20నే వెలుగులోకి వచ్చింది. 111 జీవో రద్దుతో ఈ ప్రాంత పరిధిలోని 84 గ్రామాల్లోని భూముల ధరలకు భారీ ఎత్తున రెక్కలు రానున్నాయి. దీనికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకున్న వెంటనే రియల్ లావాదేవీలు ఊపందుకున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి జీవో కూడా జారీ అయింది. 111 జీవో ఎత్తేసినా కూడా జంట జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు సర్కారు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో భాగంగా.. ఎస్టీపీల ఏర్పాటు చేసి మురుగు నీరు జంట జలాశయాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. జంట జలాశయాల చుట్టుపక్కల గ్రామాల్లో సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.తద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో జంట జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై సిఫారసులు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు.
కమిటీ సభ్యులుగా మున్సిపల్, ఫైనాన్స్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాటర్ బోర్డ్ ఎండి, పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ సెక్రటరీ, హెచ్ ఎండీఏ డైరెక్టర్ ఉంటారు. జంట జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన మార్గదర్శకాల రూపకల్పన కమిటీకి సీఎస్ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీ ప్రధానంగా గ్రీన్ జోన్ ల గుర్తింపు తోపాటు మురుగు నీరు వెళ్లే టాక్ లైన్స్ ఏర్పాటు ప్లానింగ్, ఎస్ టీపీలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, 84 గ్రామాల్లో భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉండాలి అనే అంశాలపై ఖచ్చితమైన మార్గదర్శకాలతో ఈ కమిటీ సర్కారుకు సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో మౌలికసదుపాయాల కల్పన అంశం, లేఔట్లతోపాటు భవనాల అనుమతులు జారీ చేసే సమయంలో చేపట్టాల్సిన నియంత్రణా చర్యలు, ఈ ప్రాంతంలో మౌలికవసతుల కల్పనకు అయ్యే నిధుల సమీకరణ, జోనింగ్, గ్రీన్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై కూడా కమిటీ నివేదికలో పొందుపర్చాల్సి ఉంటుంది.