గత కొన్నేళ్లుగా ఏ మాత్రం ముట్టుకోని భూముల విలువలను సర్కారు ఒకేసారి పెంచేసింది. ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు వెలువడ్డాయి. పెరిగిన ధరలు గురువారం నుంచే అమల్లోకి రానున్నాయి. భూముల విలువను 50 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 7.5శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ భూముల విలువ 50 శాతం పెంపుదల జరిగింది.వ్యవసాయ భూముల కనిష్ట విలువ ఎకరానికి రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఓపెన్ ప్లాట్ల కనిష్ట విలువ చదరపు గజానికి 200 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇక అపార్ట్‌మెంట్ కనిష్ట విలువ చదరపు అడుగుకు వెయ్యి రూపాయలకు పెంచారు. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్నా కూడా పెరిగిన ధరనే చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో భూముల విలువ పెంపు ఈనెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పెంచిన ధరలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత సర్కారు భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు చేసింది. సర్కారు తాజా నిర్ణయంతో భూముల విలువతోపాటు రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.