తెలంగాణ‌లో మందు బాబుల బాధ్య‌త పెరిగింది

Update: 2022-05-19 10:40 GMT

తెలంగాణ‌కు అప్పులు ఆగాయి. కేంద్రం,ఆర్ బిఐ కొత్త అప్పులకు నో అంటున్నాయి. దీనిపై స‌ర్కారు ఫైర్ అవుతోంది. అమ‌లు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఎన్నో..సంక్షేమ కార్య‌క్ర‌మాల జాబితా చాలా పెద్ద‌దే. మ‌రో వైపు నిధుల క‌ట‌క‌ట‌. ఇప్పటికే పెంచాల్సిన ఛార్జీలు పెంచేశారు. అందుకే ఆక‌స్మాత్తుగా ఇప్పుడు మ‌ద్యం రేట్లు పెంచారు. అంటే ఇప్పుడు తెలంగాణ మందుబాబుల బాధ్య‌త మ‌రింత పెరిగిన‌ట్లు అయింది. స‌ర్కారు సంక్షేమ కార్య‌క్రమాలు...ప్రాజెక్టులు సాఫీగా సాగేందుకు వీరంతా త‌మ వంతు స‌హ‌కారం అందించాల్సిన బాధ్య‌త వీరి మీద ప‌డింది.

బుధ‌వారం సాయంత్రం అక‌స్మాత్తుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు గురువారం నుంచే అమల్లోకి వ‌చ్చాయి. మద్యం ధరలను పెంచాలంటూ రేట్‌ కాంట్రాక్ట్‌ నెగోషియేషన్‌ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిటీ సిఫారసుల మేరకే ధరలు పెంచినట్లు సర్కారు వెల్లడించింది. మ‌ద్యం ధ‌ర‌ల‌ను 20 నుంచి 25 శాతం మేర పెంచారు. బ్రాండ్ ను బ‌ట్టి ద‌ర‌ల్లో మార్పు ఉంటుంది. అయితే తాజా ధ‌ర‌ల పెంపు వ‌ల్ల స‌ర్కారు ఖ‌జానాకు ఎంత అద‌న‌పు ఆదాయం వ‌స్తుంద‌నే లెక్క‌లు ఇంకా తేలాల్సి ఉంది. 

Tags:    

Similar News