తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కేబినెట్ చాలా రోజుల కిందటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన పేరును సిఫారసు చేస్తూ ఫైలు పంపింది. అయితే ఆమె ఇంత వరకూ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. అయితే కౌషిక్ రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు ఇదే అంశంపై గవర్నర్ కు కొంత మంది ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కౌషిక్ రెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరటం...చేరిన వారం రోజులకే ఆయన్ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఎంపిక చేయటంపై అధికార పార్టీ నేతలు కూడా అవాక్కు అయ్యారు.
గవర్నర్ తమిళ్ సై బుధవారం నాడు ఈ అంశంపై స్పందించారు. కౌషిక్ రెడ్డి ఏమైనా సామాజిక సేవ చేశారా లేదా అన్న అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. అన్ని అంశాలు పరిశీలించి కొంత సమయం తరువాత నిర్ణయం తీసుకుంటానన్నారు. ఈ ఫైల్ పరిశీలనలో ఉందని, గవర్నర్ కోటఆలో ఇచ్చే ఎమ్మెల్సీ లకు సంబంధించి తనకు కొంత హక్కు ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ కు నాకు రాజకీయ పరమైన విభేదాలు లేవన్నారు. మహారాష్ట్రలో సైతం ఎమ్మెల్సీల ఫైలుపై అక్కడి గవర్నర్ ఎనిమిది నెలలుగా నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ పెట్టారు. దీంతో ప్రభుత్వం కోర్టును కూడా ఆశ్రయించింది. ఇలాంటి విషయాల్లో ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలనే నిబంధనలు ఏమీ లేకపోవటం గవర్నర్ కు సానుకూల అంశంగా మారింది.