తెలంగాణ కాంగ్రెస్ కు రిపేర్ చాలదు..ఓవర్ హాలింగే'

Update: 2020-11-10 07:33 GMT

గమ్యం లేని ప్రయాణం. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఇది. మాట్లాడితే తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకోవటం తప్ప..ఆ పార్టీ ఎక్కడా ప్రభావం చూపించలేకపోతుంది. ఏ ఎన్నిక అయినా సరే చతికిలపడాల్సిందే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జి గా మాణికం ఠాకూర్ వచ్చిన తర్వాత ఒకింత దూకుడు అయితే పెంచారు. కానీ దుబ్బాక ఉప ఎన్నికలో ఆ పార్టీకి వచ్చిన ఫలితం మాత్రం కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్ ను ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడేస్తాయనటంలో సందేహం లేదు. ఎన్నడూలేని రీతిలో మాణికం ఠాకూర్ మండలాల వారీగా రాష్ట్ర నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఇలా కీలక నేతలు అందరూ కూడా అక్కడ క్యాంప్ వేసి ప్రచారం నిర్వహించారు. కానీ పలితం చూస్తే ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోగా రాష్ట్ర స్థాయి నేతలు ఎవరూ కూడా ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారనే విషయం ఫలితాలతో తేలిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిర్ఘాంతపర్చే వాస్తవం.

కాంగ్రెస్ తో పోలిస్తే తెలంగాణలో బిజెపికి ఉన్న నాయకులు,క్యాడ ర్ చాలా తక్కువ. కానీ దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో బిజెపి చూపించిన తెగువ, పోరాటపటిమను కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం చూపించలేకపోయారని చెప్పొచ్చు. చివరి నిమిషంలో కాంగ్రెస్ దివంగత నేత ముత్యంరెడ్డి తనయుడు చెరకు శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ కేటాయించినా కూడా ఏ మాత్రం ప్రభావం చూపించలేకోపోయారు. అంతే కాదు..అగ్రశ్రేణి నాయకులు అందరూ ఒక్కచోట చేరి కూడా ఓ ఉప ఎన్నికలో ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయారనే సంకేతం పార్టీకి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే అంశం అని చెప్పదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రిపేర్ కూడా ఏ మాత్రం సరిపోదని..ఓవర్ హాలింగ్ తప్పదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరి ఇప్పటికైనా మేల్కొని కాంగ్రెస్ పార్టీ ఆ పనిచేస్తుందా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఇప్పటికే తెలంగాణ బిజెపి దూకుడు పెంచింది. ఓ వైపు టీఆర్ఎస్, మరో వైపు బిజెపి ఈ రెండింటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలంటే ఎంత శక్తివంతమైన నేతలు కావాలి..ఎంత సత్తా కావాలి. అవి కాంగ్రెస్ పార్టీకి వస్తాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలకు ఒకరంటే ఒకరు ఏ మాత్రం పడని పరిస్థితి. నేతలే నిత్యం కయ్యాలతో కాలం గడుపుతూ ఉంటే క్యాడర్ కూడా రాబోయే గెలిచే పార్టీ...గెలుస్తుందనే నమ్మకం కల్పించే పార్టీ వైపు మారటం ఖాయం. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏ మాత్రం ప్రభావం చూపించలేని పలు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరే అవకాశం ఉంది.

Tags:    

Similar News