కాంగ్రెస్ నేతల్లో హాట్ టాపిక్ గా ఇంచార్జి పాదయాత్ర వ్యవహారం!

Update: 2025-07-29 10:44 GMT

తెలంగాణ లో సాఫీగా సాగుతున్న ప్రభుత్వాన్ని ముందుకు సాగనివ్వటం కాంగ్రెస్ హై కమాండ్ కు ఏ మాత్రం ఇష్టం లేనట్లు ఉంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో కాంగ్రెస్ హై కమాండ్ కొత్త సంస్కృతిని ప్రవేశపెడుతున్న తీరు చూసి కాంగ్రెస్ నేతలు కూడా అవాక్కు అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసంతృప్తితోనే అధిష్ఠానం ఇది అంతా చేస్తుంది అనే అనుమానాలు కూడా కొంత మంది నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ల మధ్య బాగా గ్యాప్ వచ్చింది...కనీసం రేవంత్ రెడ్డి కి రాహుల్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు అని రాజకీయ వర్గాల్లో ఇటీవల వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విపక్షాల నాయకులు అయితే ఇదే అంశంపై పలు మార్లు ప్రకటనలు కూడా చేశారు. తాజాగా ఢిల్లీ లో తెలంగాణాలో విజయవంతంగా నిర్వహించిన కులగణన, బిసి రేజర్వేషన్ల కు సంబంధించిన అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఆయన టీం బాగా చేశారు అని ప్రశంసలు కురిపించారు. దీంతో చాలా వరకు రేవంత్, రాహుల్ మధ్య గ్యాప్ అంశంలో నిజం లేదు అనే ప్రచారాన్ని కూడా తెర మీదకు తీసుకువచ్చారు. అంతా బాగా సెట్ అయింది అనుకున్న సమయంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ భవన్ నుంచి వచ్చిన ప్రకటన చూసి చాలా మంది అవాక్కు అయ్యారు అనే చెప్పాలి. అదేంటి అంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ జులై 31 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించటం తో పాటు శ్రమదానం చేస్తారు అని అధికారికంగా వెల్లడించారు. కాంగ్రెస్ ఇంచార్జి తో పాటు పీసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఆయా జిల్లాల నేతలు పాల్గొంటారు అని తెలిపారు.

                                                             ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఇంచార్జి లు వ్యవహరించిన కీలక నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబి ఆజాద్ వంటి వాళ్ళు కూడా ఎప్పుడు రాష్ట్రంలో పాదయాత్రలు చేయలేదు. అసలు తెలుగు భాషే రాని..ఈ రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేని మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయటం ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు..పార్టీ లకు ఎలాంటి సంకేతం పంపాలనుకుంటున్నారు..అధిష్ఠానం అసలు ఎందుకు ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది అన్నది మంత్రులకు కూడా అంతుచిక్కని వ్యవహహారం గా ఉంది. పోనీ ఆమె పాదయాత్ర చేయటం ద్వారా రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏమైనా వస్తుందా అంటే తెలంగాణ ప్రజలకు ఆమె ఎవరో పెద్దగా తెలియదు కూడా.

                                               మరి ఆమె నేరుగా పాదయాత్ర చేయటం ద్వారా ఏమి సాధిస్తారు...రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రాలు ఇవ్వటం తప్ప అన్న చర్చ కాంగ్రెస్ నేతల్లో సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి చెక్ పెట్టడం కోసమే అనే అభిప్రాయం కూడా కొంత మంది కాంగ్రెస్ నేతల్లో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి...పీసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఆమె నేరుగా పీసిసి ప్రెసిడెంట్ ను పక్కన పెట్టుకుని పాదయాత్ర చేయటం ద్వారా పార్టీ ని తాను కంట్రోల్ లోకి తీసుకున్నాను అనే సంకేతాలు పంపుతున్నట్లు అవుతోంది అనే చర్చ సాగుతోంది. అయితే ఇది అంతా అధిష్ఠానం పెద్దల అండదండలతోనే సాగుతుండటంతో ఎక్కడో లెక్క తేడా కొడుతోంది అనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ నేతల్లో ఉంది.

Tags:    

Similar News