వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కారు కీలకమైలురాయిని దాటింది. గురువారం నాటికి రాష్ట్రంలో నాలుగు కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. అయితే ఇప్పటివరకూ మొదటి డోసు పూర్తి చేసుకున్న వారు 94 శాతంగా ఉంటే..రెండవ డోసు పూర్తి చేసుకున్న వారు 50 శాతం మాత్రమే ఉండటం విశేషం. ప్రభుత్వం వెల్లడించిన ఈ లెక్కల ప్రకారం చూస్తే రెండవ డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగమనంలో సాగుతున్నట్లు కన్పిస్తోంది. రెండవ డోసు జాప్యంలో పలు కారణాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తర్వాత కేంద్రం వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యాక్సినేషన్ ఒక్కటే కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకూ కేవలం సెకండ్ డోసు కేవలం 50 శాతం మాత్రమే పూర్తి అయినందున ఈ నెలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయటం అంత సులభం కాదని భావిస్తున్నారు.