ఏడాది అయినా ఆ ఇద్దరు ఐఏఎస్ లను టచ్ చేయలేని సర్కారు

Update: 2024-11-18 11:56 GMT

బిఆర్ఎస్ హయాంలో కట్టిన తెలంగాణ నూతన సచివాలయానికి సంబంధించి ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలులో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజాన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దగ్గర దగ్గర 300 కోట్ల రూపాయల కొనుగోళ్ళకు సంబంధించి ఆయన టెండర్లు పిలవకుండా..కొటేషన్స్ పిలిచి పనులు అప్పగించినట్లు తేలింది. ఇది అంతా అప్పటి సీఎం కెసిఆర్, ఐటి శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారమే జరిగింది అని చెపుతున్నారు. విచిత్రం ఏమిటి అంటే ఈ వ్యవహారంపై విచారణ సాగుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్న జయేష్ రంజన్ ను మాత్రం అక్కడ నుంచి తప్పించటం లేదు. ఎవరైతే తప్పు చేశారో..ఆ అధికారి అదే సీట్ లో ఉంటే విచారణ సాఫీగా సాగుతుందా?. నిజాలు బయటకు వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.

                                                      మరో వైపు అసలు తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ల్లో ఎవరికీ జయేష్ రంజన్ తరహాలో ఐటి, పరిశ్రమల శాఖ నిర్వహించటం చేతకాదు అన్న తరహాలో ఆయన్ను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే కొనసాగిస్తోంది. బిఆర్ఎస్ హయాంలో ఆయనే సుదీర్ఘకాలం ఐటి , పరిశ్రమల శాఖ బాధ్యతలు చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా ఆయన్ను అక్కడ నుంచి తప్పించలేకపోతున్నారు. పైగా ఆయనపైనే ఆరోపణలు ఉండి...విచారణ సాగుతున్నా కూడా కొనసాగించటం అంటే ఇంత కంటే విచిత్రం మరొకటి ఉండదు అనే చర్చ సాగుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇదే జయేష్ రంజన్, రెవిన్యూ ముఖ్యదర్శి నవీన్ మిట్టల్ పై ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సిసిఎల్ఏ బాధ్యతల్లో కూడా ఆయన పై పలు ఆరోపణలు వచ్చాయి.

                                                 ఇప్పటికే తెలంగాణాలో పలు మార్లు ఐఏఎస్ ల బదిలీలు జరిగినా కూడా అటు జయేష్ రంజన్, ఇటు నవీన్ మిట్టల్ లు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టచ్ చేయటం లేదు. దీంతో ఈ మొత్తం వ్యవహారం వెనక ఏదో జరుగుతుంది అనే అనుమానాలు లేకపోలేదు. ప్రధానంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి విషయంలో చేసినన్ని ఆరోపణలు అన్ని ఇన్ని కావు. కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళను అదే స్థానాల్లో కొనసాగిస్తూ అక్రమాలను ఏమి వెలికి తీస్తుంది అన్నది ఎక్కువ మందిలో వ్యక్తం అవుతున్న సందేహం. పలు విషయాల్లో రేవంత్ రెడ్డి సర్కారు అనుభవ రాహిత్యం బయటపడుతూనే ఉంది. ఈ తరుణంలో కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ లు అంత ఈజీగా తమ తప్పులు దొరకనిస్తారా అన్నది కీలక విషయం. కొంత మంది ముఖ్యంగా జయేష్ రంజన్, నవీన్ మిట్టల్ వంటి అధికారుల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

Tags:    

Similar News