కీలక హామీల సంగతి ఏంటో!

Update: 2024-10-18 04:30 GMT

హైదరాబాద్ ను వరదలు...భారీ వర్షాల నుంచి కాపాడేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తీసుకునే చర్యలను స్వాగతించాల్సిందే. తెలంగాణకే కాకుండా...దేశంలో కీలక నగరం అయిన హైదరాబాద్ ను భవిష్యత్ తరాల కోసం మరింత మెరుగైన నగరంగా తీర్చిదిద్దటం కూడా మంచిదే. కానీ తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన ఎన్నో కీలక హామీలు ఉండగా..వాటి అన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు మూసీ పునర్జీవం ప్రాజెక్ట్ పై ఇంత వేగం అకస్మాత్తుగా ఎందుకు వచ్చింది అన్న అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏ పని అయినా...ఎప్పుడైనా చేయవచ్చు. ఇందులో సందేహం ఏమీ లేదు. కానీ నిధుల సమస్య పేరు చెప్పి గత ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలు...మేనిఫెస్టోలో పెట్టిన మహాలక్షి పధకం కింద మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు ఇచ్చే స్కీం, రైతులు, కౌలు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా , పెన్షన్ పెంపు వంటి స్కీం లు ఇంకా అమలుకు నోచుకోవటం లేదు.

                                                                             ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల మేర రైతు రుణ మాఫీ చేసినా కూడా...రైతు భరోసా ఆపటం వల్ల రైతుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది అని కాంగ్రెస్ నాయకులు కూడా చెపుతున్నారు. తొలుత రైతు భోరోసా ను అమలు చేసి...రుణ మాఫీని కొంత ఆలస్యంగా అమలు చేసినా ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదని..కానీ ఇప్పుడు దగ్గర దగ్గర 20 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ కోసం ఖర్చు పెట్టి కూడా రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన హామీల అమలుకే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు వనరులు లేవు. పైగా చేయాల్సిన పనులు, బిఆర్ఎస్ పెండింగ్ లో పెట్టిన బకాయిలు కూడా ఎన్నో ఉన్నాయి. మరో వైపు ఎలా చూసుకున్నా కూడా మూసీ పునర్జీవ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే దీనిపై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీనికి వనరుల సమీకరణ అతి పెద్ద సవాల్ గా మారటం ఖాయం. కీలక హామీలు అమలు చేయకుండా మూసీ ప్రాజెక్ట్ అమలుపైనే ఫోకస్ పెడితే రాజకీయంగా తిప్పలు తప్పవు అనే చెప్పొచ్చు.

                                                                             ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రభుత్వం కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు చేపట్టిన పెద్దగా సమస్యలకు ఛాన్స్ ఉండదు అనే చెప్పొచ్చు. అయితే సడన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఈ భారీ ప్రాజెక్ట్ ను తెర మీదకు తీసుకురావటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోనీ నిజంగా చిత్తశుద్దితో ఈ ప్రాజెక్ట్ చేపట్టి ఉంటే... నగరవాసులతో పాటు ఈ ప్రాజెక్ట్ వల్ల ఇబ్బంది పడే ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి కానీ...సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో జర్నలిస్ట్ లు కూడా దీనిపై తమ అభిప్రాయం చెప్పాలి అని..మీరు వద్దు అంటే ప్రాజెక్ట్ ఆపేస్తాను అని వ్యాఖ్యానించటం కూడా చర్చకు కారణం అయింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రాజెక్టులను మీడియా ఒపీనియన్ తీసుకుని చేస్తాయా అన్న విమర్శలు తెరమీదకు వచ్చాయి. గురువారం నాడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూసినా వాళ్ళు అంతా కూడా ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత బేలగా మారిపోయారో అర్ధం కావటంలేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News