అవినీతి ఆరోపణలతో తొలగింపు?
అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా
టీఆర్ఎస్, మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం
గటిక విజయ్ కుమార్. హోదా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పీఆర్ వో. కానీ సీపీఆర్ వో కంటే ఎక్కువ కీలక పాత్ర పోషించేవారు. సీఎం ప్రెస్ మీట్ ఉంది అంటే..సహజంగా సీపీఆర్ వో కీలకంగా వ్యవహరిస్తారు. ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర ఇదే జరిగేది. కానీ సీఎం కెసీఆర్ దగ్గర మాత్రం పీఆర్ వో విజయ్ కుమార్ మాత్రమే కీలకంగా ఉండేవారు. దీంతో ఆయన సీఎం కెసీఆర్ కు అత్యంత సన్నిహితుడు అని ప్రచారం జరిగింది. పీఆర్ వో గా ఉండగానే ఏకంగా ఓ నోటిఫికేషన్ ఇప్పించి మరీ విద్యుత్ సంస్థల్లో అత్యంత కీలకమైన ఉద్యోగం ఇప్పించారు. దీనిపైనే అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే బుధవారం ఉదయం నుంచే విజయ్ కుమార్ రాజీనామా వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అయింది. ఆయన కూడా తాను వ్యక్తిగత కారణాల వల్ల తాను సీఎం పీఆర్ వో పదవికి రాజీనామా చేసినట్లు ఓ పోస్ట్ పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అయితే సీఎం పీఆర్ వో పదవి నుంచి అయితే తప్పుకోవచ్చు. కానీ ఏకంగా లక్షల్లో వేతనం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా?. అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు.
అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే సీరియస్ వార్నింగ్ తోనే పీఆర్ వో పోస్టుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా తప్పుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీఎం కెసీఆర్ కు అత్యంత గురి ఉండే ఓ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు చేసిన ఫిర్యాదుతో డొంక కదిలిందని..దీంతోపాటు కొంత మంది సీనియర్ మంత్రులు. ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేయటంతో సీఎం కెసీఆర్ ఆయన్ను పదవి నుంచి తప్పించినట్లు చెబుతున్నారు. భూ వ్యవహారాలతోపాటు పలు అంశాలపై తీవ్ర ఆరోపణలతో రావటం..వాటికి సంబంధించిన సమాచారం కూడా నిర్ధారణ కావటంతో సీఎం కెసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.