ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం సాయంత్రం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. వీరిద్దరి భేటీ దాదాపు గంటన్నరపాటు సాగింది. తెలంగాణకు సంబంధించిన పలు రహదారుల అంశంపై కేంద్రం మంత్రికి సీఎం కెసీఆర్ వినతిపత్రాలు అందజేశారు. అందులోని అంశాలు ఇలా ఉన్నాయి. ఎన్ హెచ్ 165 హైదరాబాద్ ఓఆర్ఆర్ కల్వకుర్తి వరకు ఉన్న రహదారి నాలుగు లైన్ల రహదారిగా గుర్తించాలని కోరారు. 2021-23 రెండు ఆర్థిక సంవత్సరాల్లో సిఆర్ఐఎఫ్ కింద పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించాలన్నారు. సిఆర్ఐఎఫ్ కింద ఏడాదికి 250 కోట్లు రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు.
' చౌటుప్పల్-షాద్ నగర్- సంగారెడ్డి మధ్య 182 కిలో మీటర్లు నిర్మించే సదరన్ ఎక్స్ప్రెస్ వే ను మంజూరు చేయాలి. తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన ఎన్ హెచ్ 65 ను ఆరు లైన్ల రహదారిగా మర్చే అంశం దృష్టి సారించాలి. నాలుగు కీలకమైన రాష్ట్ర రహదారులు.. చౌటుప్పల్-అమన్ గల్- షాద్ నగర్- కందీ, కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, కొత్త కోట-గూడురు మీదుగా మంత్రాలమ వరకు, బీదర్-జహీరాబాద్-బీదర్ లను జాతీయ రహదారులుగా మంజూరు చేయాలి' అని నితిన్ గడ్కరీని కోరారు.