బెంగుళూరులో మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ తర్వాత తెలంగాణ సీఎం కెసీఆర్ చేసిన ప్రకటన ఇది. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో భారీ మార్పులు రాబోతున్నాయని..దీన్ని ఎవరూ ఆపలేరు అంటూ వ్యాఖ్యానించారు. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానన్నారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు సంతోషంగా లేవన్నారు. భారత్‌లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయన్నారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించటంలో బిజెపి, కాంగ్రెస్ లు విఫలమయ్యాయని తెలిపారు.
తాము కర్ణాటక, జాతీయ రాజకీయ అంశాలపై చర్చించామని సీఎం కెసీఆర్ తెలిపారు. దేశంలో జీడీపీ పడిపోతుందని..ద్రవ్యోల్భణం పెరుగుతుందని, పరిశ్రమలు మూత పడుతున్నాయని విమర్శించారు. మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ సీఎం కెసీఆర్ ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని..అందులో భాగంగానే ఆయన పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ నాయకులను కలుస్తున్నారని తెలిపారు. దేశ ప్రజల ప్రయోజనాల కోణంలో ఆయన మార్పులు తెచ్చేందుకు కెసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.