ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏది?!

Update: 2024-10-17 06:23 GMT

దసరా పండగ అయిపోయింది. దీపావళి వస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి ఏడాది కూడా పూర్తి అవుతుంది. కానీ తెలంగాణా క్యాబినెట్ విస్తరణ మాత్రం ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాదు, ఆదిలాబాద్ తదితర జిల్లాలకు అసలు మంత్రివర్గంలో ప్రాధాన్యతే లేదు. మరో వైపు పరిపాలనలో ఎంతో ముఖ్యమైన హోమ్, విద్యా, మున్సిపల్ , కార్మిక శాఖలకు మంత్రులు కూడా లేదు. పరిపాలనలో ఏ మాత్రం గత అనుభవం లేని...రేవంత్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. పైగా అన్ని కీలక శాఖలు తన వద్ద పెట్టుకోవటం పలు విమర్శలకు కారణం అవుతోంది. దీంతో ఈ శాఖలకు సంబంధించి వచ్చే విమర్శలు అన్ని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కే తగులుతున్నాయి. అటు మూసి అయినా...ఇటు హైడ్రా విషయం అయినా అన్నీ అలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సిన ప్రభుత్వం ముందు నిర్ణయాలు ప్రకటించి...వీటిపై తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత దిద్దుబాటులకు దిగుతుండటంతో రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం బయటపడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పదేళ్ల పోరాటం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంట వెంటనే అర్హులకు...పార్టీ కోసం పని చేసిన వాళ్లకు పదవులు ఇచ్చి జోష్ తీసుకురావాల్సిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

                                                                                            కెసిఆర్ తన  టర్మ్ లో ఒకసారి కొన్ని నెలలపాటు అసలు మంత్రి వర్గమే లేకుండా అహంకారంతో పాలన సాగిస్తే ..ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయి క్యాబినెట్ ను ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉన్నారు అని కాంగ్రెస్ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సరిగా ఉపయోగించుకోలేక పౌతుంది అని...ఇంకో మాటలో చెప్పాలంటే అవకాశం ఉండి కూడా ఆరుగురు ఏడాది కాలం మంత్రి పదవి హోదాను కోల్పోయినట్లు అయింది అని చెపుతున్నారు. ఇప్పటికే ఉన్న మంత్రి వర్గంలో సీఎం రేవంత్ రెడ్డి, కీలక మంత్రుల మధ్య బాగా గ్యాప్ ఉంది అని... ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ అసలు సీఎం తో తమకు సంబంధము లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చివరకు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ఇంత దారుణ పరిస్థితులు లేవు అని ఒక నేత వ్యాఖ్యానించటం విశేషం. వరస ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం గత తప్పుల నుంచి ఏ మాత్రం పాఠాలు నేర్చుకోకుండా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలన సాఫీగా సాగేందుకు సహకరించకుండా పలు చిక్కులు సృష్టిస్తోంది అనే విమర్శలు ఉన్నాయి. వెరసి అటు మంత్రి వర్గ విస్తరణ తో పాటు నామినేటెడ్ పోస్టుల విషయంలోఅదే నాన్చుడు ధోరణి చూపిస్తోంది అని...ఇది మొత్తం చూసిన వాళ్లకు కాంగ్రెస్ ఏమి మారలేదు అనే అభిప్రాయాన్ని కలిగించటం సహజం. అది రాజకీయంగా ఆ పార్టీ నష్టమే తప్ప..ఏ మాత్రం లాభం చేకూర్చేది కాదు.

Tags:    

Similar News