ఈటల సంచలన వ్యాఖ్యలు

Update: 2023-11-10 15:15 GMT

Full Viewతెలంగాణ బీజేపీ లో కీలక పరిణామం. బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అభ్యర్థి అని ప్రధాని మోడీ స్వయంగా బీసీ నేతలకు చెప్పినట్లు ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆయన తాజాగా పలు జాతీయ చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలోనే ఈటల రాజేందర్ ఈ విషయం బహిర్గతం చేశారు. ఇది మోడీ అందరి ముందు చెప్పిన మాట అని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లో సీఎం కెసిఆర్ పై పోటీ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి గజ్వేల్ పై పడిన విషయం తెలిసిందే. బీజేపీ తాము అధికారంలోకి వస్తే బీసీ ని సీఎం చేస్తామనే నినాదం అందుకుంది. కానీ సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. ఈ తరుణంలో ఈటల రాజేందర్ బయటపెట్టిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయనే చెప్పొచ్చు. ఒక వైపు బండి సంజయ్ బుధవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక సభలో మాట్లాడుతున్న సమయంలో కొంత మంది కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలోనే బండి సంజయ్ ఇలా అనే తన పదవి పోగొట్టారు అని కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

                                   ఈ తరుణంలో ఈటల రాజేందర్ వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. తెలంగాణ లో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉన్న జోష్ ఇప్పుడు మచ్చుకైనా కనిపించటం లేదు అనే చర్చ బీజేపీ నేతల్లో కూడా ఉంది. మరో వైపు ఇటీవల హైదరాబాద్ లో ఒక బహిరంగ సభలో పాల్గొన్న మోడీ తాజాగా వెలుగులోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యాలపై నోరు ఎత్తలేదు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా కేంద్రం లోని బీజేపీ సర్కారే కాపాడుకుతుంది అనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామాలు అన్నీ చుసిన తర్వాత ప్రజలు అంతా ఈ రెండు పార్టీలు ఒకటే అనే అభిప్రాయంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఈటల రాజేందర్ తానే సీఎం అభ్యర్థి అని ..మోడీ చెప్పినట్లు బహిర్గతం చేయటం రాజకీయంగా ఏమైనా కలిసి వస్తుందా..లేక కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందా అన్నది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News