టీచ‌ర్ల ఆస్తుల ద‌గ్గ‌ర మొద‌లై..కెసీఆర్ ఆస్తుల వ‌ర‌కూ వెళ్లి...ఆగిపోయింది!

Update: 2022-06-25 16:06 GMT
టీచ‌ర్ల ఆస్తుల ద‌గ్గ‌ర మొద‌లై..కెసీఆర్ ఆస్తుల వ‌ర‌కూ వెళ్లి...ఆగిపోయింది!
  • whatsapp icon

గంటల వ్య‌వ‌ధిలోనే తెలంగాణ స‌ర్కారు రివ‌ర్స్ గేర్ వేసింది. వాస్త‌వానికి ఈ ఉత్త‌ర్వులు వ‌చ్చి చాలా రోజులు అయినా మీడియా కంట ప‌డింది ఇవాళే. అది అలామీడియా కంట ప‌డిందో లేదో..ఒక్క‌సారిగా హంగామా మొద‌లైంది. తెలంగాణ టీచ‌ర్ల‌కు స‌ర్కారు షాక్..షాక్ అంటూ హ‌డావుడి చేయ‌టం..దీనిపై చ‌ర్చ‌లు పెట్ట‌డం కూడా జ‌రిగిపోయింది. దీంతో ఇది ఏటో వెళుతుంద‌నే విష‌యాన్ని గ్ర‌హించిన సర్కారు అంతా తూచ్...ఇది ఎప్ప‌టి నుంచో ఉన్న నిబంధ‌నే..కొత్త‌గా తెచ్చింది ఏమీకాదు..అయినా ఈ ఆదేశాలు వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. ప‌నిలో ప‌నిగా స‌ర్కారు తాజా ఆదేశాల‌తో రాజ‌కీయ పార్టీలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ దీనిపై స్పందిస్తూ సీఎం కెసీఆర్, ఆయ‌న కుటంబ స‌భ్యులు కూడా ప్ర‌తి ఏటా ఆస్తులు ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. మంత్రులు..ఎమ్మెల్యేలు కూడా అలాగే చేయాల‌న్నారు. టీచ‌ర్ల‌కే ఈ నిబంధ‌న ఎందుకు అంటూ ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌రెడ్డి కూడా టీచ‌ర్ల‌ను వేధించేందుకే ఇలాంటి నిర్ణ‌యం అంటూ మండిప‌డ్డారు. వ్య‌వ‌హారం ఏటో వెళుతుండ‌టంతో స‌ర్కారు ఆగ‌మేఘాల మీద దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేరుతో ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అందులో టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటనపై జీవోను తెలంగాణ సర్కార్‌ నిలిపివేస్తుంద‌ని...ఈ మేర‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తాజాగా స‌ర్కారు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తప్పసరి చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. టీచర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ వ్య‌వ‌హారంపై అధికారులు స్పందిస్తూ టీచ‌ర్ల ద‌గ్గ‌ర మొద‌లుపెడితే ఇది చివ‌ర‌కు ఏకంగా సీఎం కెసీఆర్ వ‌ర‌కూ వెళ్లింద‌ని..ఎన్నిక‌ల‌కు ముందు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటే ఇలాగే ఉంటంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి ఈ నిబంధ‌న ఎప్ప‌టి నుంచో ఉంటే ఇప్పుడు కొత్త‌గా ఆదేశాలు ఎందుకు జారీ చేసిన‌ట్లు. ఎందుకు వెన‌క్కి త‌గ్గిన‌ట్లు అన్న‌ది స‌మాధానం లేని ప్ర‌శ్నే. 

Tags:    

Similar News