వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణాలో అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బిజెపి అందుకు అనుగుణంగానే ప్లాన్స్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని..అమరుల త్యాగాలతో వచ్చిన రాష్ట్రంలో దోపిడీ సాగుతోందని చూపించాలనేది బిజెపి ప్లాన్. ఈ దిశగానే ప్రస్తుతం అన్నీ సాగుతున్నాయి. ఇప్పటికే బిజెపితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా కాళేశ్వరం దగ్గర నుంచి పలు ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కామ్, ఐటి దాడులు కేవలం శాంపిల్ మాత్రమేనని..రాబోయే రోజుల్లో అసలు సినిమా ఉందని చెబుతున్నారు. సీఎం కెసీఆర్ తరహాలోనే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కాలుదువ్వారు. కానీ మంత్రి పార్ధా చటర్టీ సన్నిహితురాలి ఇంట్లో కోట్లాది రూపాయల నగదు పట్టుకోవటంతో ఇప్పుడు మమతా బెనర్జీ నోరెత్తలేని పరిస్థితి. మరి ఈ టార్గెట్ టీఆర్ఎస్ వ్యవహారంలో ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో వేచిచూడాల్సిందే.