బిజెపి జాతీయ నేతలు అందరూ జీహెచ్ఎంసీ ప్రచారం కోసం తరలివస్తున్నారు. రోజుకు ఒక నేత చొప్పున హైదరాబాద్ లో ప్రచారం నిర్వహిస్తూ బిజెపిలో జోష్ తెచ్చే పనిలో పడ్డారు. బుధవారం నాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంలది అవినీతి కూటమి అని, రోహింగ్యాలను ఓటర్ లిస్టులో చేర్చమని ఎంఐఎం కేంద్రానికి లేఖ కూడా రాసిందని స్మృతి ఇరానీ వెల్లడించారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని, రోహింగ్యాల విషయంలో టీఆర్‌ఎస్ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అక్రమ చొరబాటుదారులకు టీఆర్‌ఎస్, ఎంఐఎం మద్దతిస్తున్నాయని, అక్రమ చొరబాటుదారులు ఓటర్ లిస్టుల్లో కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు. రోహింగ్యాలను టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి తమ రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నాయని, 75 వేల రోహింగ్యాల కుటుంబాలు హైదరాబాద్‌లో నివసిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎందరో మంది అమరులయ్యారని, ఆ తెలంగాణలోనే ఇప్పుడు కుటుంబ పాలన సాగుతోందని ఇరానీ విమర్శించారు.
టీఆర్‌ఎస్‌లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తూనే ఉందని, అందుకే బీజేపీ కార్యకర్తలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై అధికార టీఆర్‌ఎస్ అక్రమ కేసులు బనాయిస్తోందని, దుబ్బాకలో కూడా బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 75 వేల అక్రమ కట్టడాలు వెలిశాయని, అవన్నీ టీఆర్‌ఎస్, ఎంఐఎం భాగస్వామ్యంతోనే వెలిశాయని విమర్శించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్నదే తమ నినాదమని, ఆ నినాదంతోనే ముందుకెళ్తామని ఇరానీ స్పష్టం చేశారు. సిటీలో వరదల కారణంగా 80 మంది చనిపోయారని, వరద నష్టంపై ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం సమగ్ర నివేదికలనే కేంద్రానికి పంపలేదని ఆమె విమర్శించారు.