సిరిసిల్ల. ఇది తెలంగాణ పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటీఆర్ నియోజకవర్గం. కొద్ది రోజుల క్రితమే అక్కడ కొత్త కలెక్టర్ కార్యాలయం నిర్మించారు. కానీ వర్షం వస్తే ఆ కలెక్టర్ కార్యాలయం ముందు నీరు చేరుతుంది. అలా ఇలా కాదు...ఏకంగా మోకాళ్ళకుపైనే అక్కడ నీళ్లు నిలుస్తాయి. గతంలోనూ దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలకు సీన్ రిపీట్ అయింది. అంతే కాదు...ఏకంగా కలెక్టర్ అక్కడ నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన్ను బయటకు తీసుకొచ్చేందుకు ఏకంగా ఓ ట్రాక్టర్, దాని వెంట జెసీబీని తీసుకెళ్లి మరీ ఆయన్ను బయటకు తెచ్చారు. సహజంగా కలెక్టర్ అంటే ఖరీదైన కారుతో హంగూ, ఆర్భాటంతో బయటకు వెళతారు. కానీ ఇక్కడ నీళ్ళ దెబ్బకు సీన్ మారింది. మంగళవారం నాడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కలెక్టర్ వెళ్లాల్సి ఉంది.
వరద తీవ్రంగా ఉండటంతో కలెక్టర్ బయటకు రాలేకపోయారు. దీంతో ట్రాక్టర్, జేసీబీ తీసుకొచ్చి.. ట్రాక్టర్ లో కలెక్టర్ అనురాగ్ జయంత్ ను బయటకు తీసుకొచ్చారు. ట్రాక్టర్ ఆగిపోతే నెట్టేందుకు వెనకాలే జేసీబీ కూడా వెళ్లింది. గతంలోనూ రెండు మూడు సార్లు కలెక్టరేట్ నీట మునిగింది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టరేట్ చుట్టూ దాదాపు అరకిలోమీటరు మేర భారీగా వరద నీరు చేరింది. నీరు భారీగా ప్రవహిస్తుండటంతో.. కలెక్టరేట్ కు వెళ్లే మార్గం చిన్నపాటి నదీ ప్రవాహంలా కనిపిస్తోంది. కలెక్టరేట్ చుట్టూ చేరిన నీటిని బయటకు పంపిచేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త కార్యాలయం కట్టేటప్పుడు ఆ మాత్రం చూసుకోరా అంటూ నెటిజన్లు సర్కారు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.