కెసీఆర్ కు సంక్రాంతి గిఫ్ట్ కూడా ఖాయం

Update: 2020-11-11 14:12 GMT

దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో తెలంగాణ బిజెపి దూకుడు మీద ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆ పార్టీ టార్గెట్ చేసింది. దుబ్బాక జోష్ తో జీహెచ్ఎంసీలో కూడా సత్తా చాటేందుకు ఇప్పటికే బిజెపి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అంతే కాదు..జనసేనతో తెలంగాణలో పొత్తును జీహెఛ్ఎంసీ ఎన్నికల నుంచే మొదలుపెట్టనున్నారు. దీనికి సంబంధించి కసరత్తు కూడా ఎప్పుడో ప్రారంభించారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బుధవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితం ద్వారా సీఎం కెసీఆర్ కు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని..జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కూడా ప్రజలు సంక్రాంతి గిఫ్ట్ కూడా ఇస్తారన్నారు. 'బీజేపీ ఎక్కడ ఉందన్న కేసీఆర్‌కు ఇప్పుడే చెప్తున్నా.. నీ సొంత జిల్లాలో మా ఎమ్మెల్యే ఉన్నడు. ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి' అని వ్యాఖ్యానించారు.

జూమ్‌ యాప్‌ ద్వారా ఆయన మాట్లాడుతూ.. ' ' తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారు. ఫాం హౌస్‌‌లో దొడ్డు బియ్యం పండించి, రాష్ట్ర రైతులను సన్న బియ్యం పండించమని మోసం చేశారు. ఎల్ ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. పాతబస్తీలో పన్నులు ఎంత వసూలు చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పట్లేదు. రాష్ట్ర ఖజానాను పాతబస్తీలో ఖర్చు పెడుతున్నారు. ఓట్ల కొనుగోలు కోసమే పది వేల నగదు పంచుతున్నారు. లాక్ డౌన్‌తో ఏంతో మంది పేదల జీవితాలు నాశనం అయ్యాయి. వారిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. బీజేపీ అభ్యంతరాలను ఎన్నికల కమీషన్ పరిశీలించి, పరిష్కరించాలి. గ్రేటర్‌లో బీజేపీ గెలవబోతుందని అన్ని సర్వేల్లో తేలిందని అన్నారు.

Tags:    

Similar News