ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలే విత్తనాలు అమ్మాలి

Update: 2021-05-29 14:41 GMT

జూన్ 15 నుంచి రైతుబంధు..కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం

సీఎం కెసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ శనివారం నాడు వ్యవసాయ రంగానికి సంబంధించి పలు అంశాలపై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సిఎం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీలే విత్తన విక్రయాలు చేపట్టేలా ఈ నియంత్రణ చర్యలుండాలని తెలిపారు. క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రభుత్వ సర్టిఫైడ్ ముద్రిత విత్తనాల ప్యాకెట్ల మీద ఉంటున్నందున, స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేయడం ద్వారా విత్తన కంపెనీల పూర్తి వివరాలుంటాయని మంత్రి సిఎం కెసిఆర్ కు వివరించారు. ఆలశ్యం చేయకుండా తక్షణమే ఈ విధానాన్ని అమలులోకి తేవాలని సిఎం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు.

జూన్ 15 నుంచి 25 వరకు రైతుబంధు ఆర్ధిక సాయాన్ని ఎప్పటిలాగే ఆయా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆర్ధిక శాఖ కార్యదర్శిని సిఎం ఆదేశించారు. జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సిఎం కెసిఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిఎం ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కేటగిరీ ల వారిగానే రైతు బంధు ఆర్ధిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్ గా పెట్టుకోని ఆ తేదీవరకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప చేయాలని సిఎం ఆదేశించారు. '' దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతువద్దనుంచి ఒక్కగింజకూడా కొంటలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులకు పాల్పడుతున్నరు. కానీ వాస్తవం తెలిసిన, విజ్జత కలిగిన రైతులు ప్రతిపక్షాల ఆటలు సాగనిస్తలేరు. తిట్టి ఎల్లగొడుతున్నరు.

గత సంవత్సరంలో కరోనా సమయంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పుకూలితే తెలంగాణ జీఎస్డీపీకి వ్యవసాయ రంగం 17 శాతం ఆదాయన్ని అందచేసింది. ఇంకా పరోక్షంగా రాష్ట్ర ఆదాయానికి వ్యవసాయ రంగం ఆదెరువుగా మారే పరిస్థితికి చేరుకున్నిది'' అని సిఎం అన్నారు. '' ఇవన్నీ అల్లాటప్ప మాటలు కావు. పిచ్చికూతలతోని అయ్యే పనులు కావు. ఇందుకు ఎంతో ధైర్యం కావాలె. ఇవ్వాల తెలంగాణలో రైతుల వద్ద ధాన్యాన్ని కొనడం అంటే ఒక సాహసం. దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ చేసింది. కరోనా సమయంలో లారీలు, హమాలీలు, డ్రైవర్లు, అన్ని కొరతే అయినా వాటన్నిటినీ అధిగమిస్తూ, ఇప్పటికే 87 శాతం ధాన్యాన్ని సేకరించినం. మరో నాలుగైదు రోజుల్లో సంపూర్ణ సేకరణ జరుపుతాం. ఎఫ్ సి ఐ తో మాట్లాడి ఎంత ధాన్యం వచ్చినా తప్పకుండా ప్రభుత్వం కొంటుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనలకు గురికావద్దు..ఆగమాగం కావద్దు.'' అని సిఎం అన్నారు.

తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నమని సిఎం తెలిపారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరిచంక పోవడం పై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇట్లా వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయనున్నామన్నారు. కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారులమీద దాడులు జరపాలని . కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంతటి వారినైనా పీడీ యాక్టుకింద అరెస్టు చేసి చట్టబపరమైన చర్యలు తీసుకోవాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తశుద్దితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీల తో పాటు ప్రభుత్వం సేవా పతకం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు. ఈ మేరకు తక్షణమే జిల్లాల వారిగా పోలీసులను రంగంలోకి దించాలని డిజిపీ కి ఫోన్లో సిఎం ఆదేశించారు. నిఘావర్గాలు కల్తీ విత్తన తయారీదారుల మూఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్ ఐజీని సిఎం ఆదేశించారు.

Tags:    

Similar News