వ్యూహం లేక ..బిక్క చూపులు

Update: 2024-07-30 04:42 GMT

పదేళ్ల పాలన. పెద్ద ఎత్తున స్కాంలు. బిఆర్ఎస్ సమాదానాలు చెప్పుకోవాల్సిన అంశాలు ఎన్నో. కానీ తెలంగాణ అసెంబ్లీలో చూస్తే సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. బిఆర్ఎస్ బ్యాటింగ్ కు అధికార కాంగ్రెస్ పార్టీ కకావికలు అవుతున్నట్లు ఉంది అనే చర్చ ఈ సమావేశాలను చూసిన వాళ్లకు కలుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుతీరిన తర్వాత ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతోంది అని...తప్పులు చేసిన బిఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తున్న తరహాలో అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరుతో కాంగ్రెస్ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు అనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే కొంత ఆలస్యం అయినా కూడా ప్రతిష్టాత్మకమైన రుణ మాఫీ అమలు విషయంలో ముందుకు వెళుతూ..బడ్జెట్ లో కూడా రైతుల కోసం భారీ ఎత్తున కేటాయింపులు చేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభావాన్ని తనకు సానుకూలంగా మార్చుకోవటంలో విఫలం అవుతోంది అనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో బిఆర్ఎస్ నేతలు ప్రసంగాలు చేస్తే ..అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సమాదానాలు చెపుతున్నట్లు ఉంది తప్ప...ఎన్నో తప్పులు చేసిన బిఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్కసారి కూడా సభా వేదికగా ఇరకాటంలోకి నెట్టినట్లు ఈ సమావేశాలు చూసిన వాళ్లకు ఎవరికీ అనిపించలేదు అనే చర్చ అటు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా సాగుతోంది.

                                                                  అసెంబ్లీ లో అధికార కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కడా పెద్దగా భాగస్వామ్యం అవుతున్నట్లు కనిపించదు. సోమవారం నాడు విద్యుత్ పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఉండకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది అనే అభిప్రాయం ఎక్కువ మంది లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించిన తీరు ఒక మంత్రిలా మాట్లాడినట్లు ఉంది తప్ప...కాంగ్రెస్ చెపుతున్నట్లు వేల కోట్ల రూపాయల స్కాం లు చేసిన వాళ్ళు మాట్లాడినట్లు లేదు అనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లోనే ఉంది. కాంగ్రెస్ చెపుతున్నట్లు ఎన్నో పాపాలు చేసిన బిఆర్ఎస్ నేతలు ఎదురుదాడి మార్గాన్ని ఎంచుకుంటే...అధికార కాంగ్రెస్ మాత్రం సభలో హాండ్స్ అప్ అన్న చందంగా వ్యవరిస్తుండటం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణం అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల విషయంలో ఏ మాత్రం ఒక స్ట్రాటజీ లేకుండా వ్యవహరించటమే అనే అభిప్రాయం కూడా కొంత మంది పార్టీ నేతల్లో ఉంది. సభ లో ఏ రోజు ఏ అంశం చర్చకు ఉందో దానికి అనుగుణంగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో ఒక టీం ఏర్పాటు చేసుకుని..పక్కా సమాచారంతో..ఆధారాలతో బిఆర్ఎస్ ను నోరు తెరవకుండా చేయాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ ని ఆత్మరక్షణలో ఉన్నట్లు వ్యవరించటంపై విస్మయం వ్యక్తం అవుతోంది.

                                                                               అధికార పార్టీ అసెంబ్లీ సమావేశాల కోసం ఎలాంటి ముందస్తు కసరత్తు చేయటం లేదు అనే విషయం సమావేశాలను చూసిన ఎవరికైనా తెలుస్తుంది అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లోనే ఉంది. బిఆర్ఎస్ పదేళ్ల హయాంలో కెసిఆర్ అండ్ కో ప్రతిపక్షాలను నోరెత్తి మాట్లాడనీయలేదు. దాంతో పోలిస్తే కాంగ్రెస్ హయాంలో పరిస్థితి అత్యంత ప్రజాస్వామికంగా ఉన్నా అది ప్రయోజనం లభించాల్సిన కాంగ్రెస్ కంటే తప్పులు చేరిన బిఆర్ఎస్ కే ఉపయోగపడుతుంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వేదికగా అప్పట్లో కెసిఆర్ ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ...అంతే తప్ప ప్రతిపక్షాలు చెప్పినట్లు చేయటానికి కాదు తాము ఇక్కడ ఉన్నది అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిఆర్ఎస్ ను కట్టడి చేయటంలో ఘోరంగా విఫలం అయింది అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. రాబోయే రోజుల్లో అయినా దీనికి అనుగుణంగా స్ట్రాటజీ సిద్ధం చేసుకోకపోతే కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం తప్పదు అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

Tags:    

Similar News