నాలుగేళ్ల త‌ర్వాత పారిశ్రామిక‌వేత్త‌ల‌కు కాప‌లా కాయాలా?

Update: 2022-06-27 12:45 GMT

అగ్నిపథ్ స్కీమ్ ను ర‌ద్దు చేసే వ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొన‌సాగిస్తుంద‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రే్వంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప‌థ‌కం ర‌ద్దు కోరుతూ దేశ వ్యాప్తంగా సోమ‌వారం నాడు కాంగ్రెస్ పార్టీ స‌త్యాగ్ర‌హ దీక్షలు చేప‌ట్టింది. అందులో భాగంగానే తెలంగాణ‌లో కాంగ్రెస్ నేత‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. స‌త్యాగ్ర‌హ దీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీరును త‌ప్పుప‌ట్టారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవానులను అవమనించేలా మోడీ సర్కారు వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్ గిరి కూడలి వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్ పాల్గొన్నారు. రైతులను, సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా వారిని కాంగ్రెస్ గుర్తించిందన్నారు. అంబానీ, ఆదానీ కంపెనీల రక్షణకు అగ్నిపథ్ పథకాన్ని తెచ్చారని ఆరోపించారు.

నాలుగేళ్లు సైన్యంలో ఆ తరువాత జీవిత కాలం బడా పారిశ్రామిక వేత్తలకు కాపలా కాయలా? అని ప్రశ్నించారు. అగ్నిపథ్‌తో ఉద్యోగ భద్రత లేదని, మాజీ సైనికుల హోదా లేదని, ఫించన్ కూడా లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిజెపి జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాన మంత్రినరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.తెలంగాణ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.లేదంటే మోదీ పర్యటనలో నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా యువతన నిరసన తెలపాలని అన్నారు. రైల్వే ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్‌ అయిన వారిని విడుదల చేయాలని కోరారు.

Tags:    

Similar News