అధికారంలో ఉన్న రాష్ట్రంలో ..ముఖ్యంగా కాంగ్రెస్ వంటి పార్టీలో పీసిసి అధినేతకు, ముఖ్యమంత్రికి మధ్య సఖ్యత ఎంతో కీలకం. అటు పార్టీ వ్యవహారాలు...ఇటు ప్రభుత్వం సాఫీగా ముందుకు సాగాలంటే ఇద్దరూ కలిసి వెళ్ళటం ఎంతో అవసరం. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ను ఎంపిక చేయటంతో పార్టీ హై కమాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి తన పట్టు నిలుపుకున్నారు అనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. టీపీసీసీ పై నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలేసినట్లు రేవంత్ రెడ్డి పలు మార్లు బహిరంగంగా చెప్పినా కూడా మహేష్ గౌడ్ ఆయన ఛాయిస్ అనే విషయం బహిరంగ రహస్యమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పట్టు ఉన్న మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ టీపీసీసీ పదవి రేస్ లో గట్టి పోటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం మధు యాష్కీ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి తో సఖ్యతతోనే ఉన్నా కూడా ఒకసారి సీట్ లో కూర్చున్నాక లెక్కలు మారిపోతాయి అనే భయంతోనే అధిష్ఠానం కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి చికాకులు లేకుండా...అటు పార్టీ, ఇటు ప్రభుత్వ వ్యవహారాలు సాఫీగా సాగాలంటే సఖ్యత ఉన్న నేతలతోనే సాధ్యం అవుతుంది అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు. మధు యాష్కీ గౌడ్ తో పాటు చాలా మంది తెరవెనక ప్రయత్నాలు చాలానే చేశారు. అయినా కూడా అవేమి ఫలించలేదు. అధికారంలో ఉన్న సమయంలో టీపీసీసీ పదవి అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. తెలంగాణాలో అత్యంత బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వటం ద్వారా కూడా రాబోయే రోజుల్లో బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు చెపుతున్నారు. కొత్త టీపీసీసీ నియామకం ద్వారా అధిష్ఠానం అటు పార్టీ నాయకులతో పాటు శ్రేణులకు కూడా ఒక సంకేతం పంపినట్లు అయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.