రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన పేషీలో అధికారుల నియామకంతో పాటు పలు విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో అధికారుల నియామకాలు...తెలంగాణకు అత్యంత కీలకమైన రాజధాని హైదరాబాద్ నగరంలోని పోలీస్ బాస్ ల పోస్టింగ్ ల విషయంలో కూడా సీఎం తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు దక్కాయి. ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి క్లీన్ గవర్నెన్స్ దిశగా ప్రయత్నం చేస్తున్నారు అనే అభిప్రాయం కలగటానికి ప్రయత్నం చేశారు అనే చర్చ సాగింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఇమేజ్ అంతా తాజాగా తీసుకున్న ఒక్క నిర్ణయంతో పోయింది అనే అభిప్రాయం అటు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీ ఉద్యోగ నియామకాలు...టిఎస్ పీఎస్సి ప్రక్షాళన. గత కెసిఆర్ సర్కారుపై నిరుద్యోగ యువతలో పెద్ద ఎత్తున ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ఒకటి. టిఎస్ పీఎస్సి కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరుని ప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేసినట్లు వార్తలు వచ్చాయి.
కెసిఆర్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం డీజీపీగా పని చేసిన మహేందర్ రెడ్డి పై ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఎన్నో విమర్శలు చేశారు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.. అంతే కాకుండా ఆయన గత ప్రభుత్వంలో పూర్తిగా అప్పటి బిఆర్ఎస్ సర్కారుకు అనుకూలంగా పనిచేశారు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఒకప్పుడు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తన విధుల్లో దూకుడు చూపించిన మహేందర్ రెడ్డి కారణాలు ఏమైనా కూడా డీజీపీ అయిన తర్వాత మాత్రం అందుకు భిన్నమైన వైఖరి ప్రదర్శించారు అనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి సర్కారు ఆయన్ను టిఎస్ పీఎస్ సి చైర్మన్ గా నియమించి సీఎం తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవటం అంత సులభం కాదు అనే చర్చ సాగుతోంది. ఒక్క అధికార వర్గాల్లో కాకుండా కాంగ్రెస్ నాయకులు..కొంత మంది మంత్రులు సైతం ఈ నిర్ణయంపై అవాక్కు అయినట్లు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నిర్ణయం మాత్రం నిరుద్యోగ యువత కు కూడా సరైన సంకేతాలు పంపే అవకాశం లేదు అనే చర్చ సాగుతోంది.