కేటీఆర్ తో పాటు కొంత మంది ఉన్నతాధికారులు కూడా విదేశీ టూర్ల లో ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చేసినట్లు ఆ శాఖ వర్గాలే చెపుతున్నాయి. కొంత మంది అధికారులు అయితే నిబంధనలకు విరుద్ధంగా కూడా తమకు నచ్చిన వారిని విదేశీ పర్యటనలకు తీసుకు వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఖజానా నుంచి వీటికి నిధులు డ్రా చేస్తే తర్వాత బయటపడుతుంది అని...కార్పొరేషన్లు...ఇతర సంస్థల ద్వారా విదేశీ పర్యటలను నిధులు వాడినట్లు చెపుతున్నారు. కేటీఆర్ అండ్ టీం విదేశీ పర్యటనలకు సంబదించిన వివరాలు మొత్తం రావాలంటే ఆయా శాఖలతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల దగ్గర నుంచి సమాచారం సేకరించనున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ పలు మార్లు దావోస్ సమావేశాలకు కూడా హాజరు అయినా విషయం తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు కొంత మంది అధికారులు చెపుతున్నారు. రేవంత్ సర్కారు ఈ లెక్కలు అన్ని బయటకు తీస్తే ఎన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సిందే. మంత్రులు విదేశీ పర్యటనలు చేయటం తప్పేమి కాదు. కానీ ఈ సమయంలో చేసే ఖర్చు కూడా హేతుబద్దంగా ఉండాలి కానీ..అడ్డగోలుగా ఉండకూడదు అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో ఇవేమి పాటించలేదు అని..ఇష్టానుసారం వ్యవహరించారు అని ఒక ఐటి శాఖ అధికారి తెలిపారు.