మొన్నటి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం ఒక ప్రధాన అజెండా గా మారింది. బహుశా దేశ చరిత్రలో మద్యం బ్రాండ్స్ కారణంగా ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఆ స్థాయిలో పెరిగింది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే అని చెప్పొచ్చు. దీనికి కారణం జగన్ సర్కారు గతంలో అందుబాటులో ఉన్న కీలక బ్రాండ్స్ చాలా వరకు మాయం చేసి...పిచ్చి పిచ్చి బ్రాండ్స్ ప్రజల మీదకు వదిలింది. అలవాటు ఉన్న వాళ్ళు దాన్ని మానుకోలేక..తిట్టుకుంటూ అయినా వాటినే తాగారు. దీని కారణంగా డబ్బుకు డబ్బు పోవటంతో పాటు మందు బాబుల ఆరోగ్యం కూడా పెద్ద ఎత్తున దెబ్బ తిన్నట్లు చాలా వార్తలే వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో జగన్ వ్యతిరేక వర్గం ఓట్లలో మందు బాబులు ముందు వరసలో ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. మరి పక్క రాష్ట్రంలో జరిగిన విషయం తెలిసిన తర్వాత కూడా తెలంగాణ లోని రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇప్పుడు అదే బాటలో పయనించడానికి సిద్ధం అయినట్లు కనిపిస్తోంది. తెలంగాణ లో కూడా జగన్ సర్కార్ మోడల్ లో కొత్త కొత్త బీర్ బ్రాండ్స్ కు అనుమతి కూడా అనుమతి ఇస్తూ పోతున్నారు. పోనీ అవి ఏమైనా దేశంలోని టాప్ టెన్ బీర్ బ్రాండ్స్ లో ఉన్నాయా అంటే అది కూడా లేదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. మరి రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో సెట్ చేయాల్సిన అంశాలు ఎన్నో ఉంటే వాటిని వదిలేసి...కొత్త కొత్త బీర్ బ్రాండ్స్ ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేయటం వెనక మతలబు ఏమిటి అన్నది ఇప్పడు కీలకంగా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కారు అయినా...తెలంగాణ లో రేవంత్ రెడ్డి సర్కారు అయినా కొత్త బ్రాండ్ల మద్యానికి అనుమతులు ఇస్తున్నారు అంటే దీని వెనక ఆర్థిక ప్రయోజనాలు తప్ప మరొకటి ఉండదు అని చెపుతున్నారు. అది మందు అయినా..ఇతర ఉత్పత్తులు అయినా కస్టమర్ల డిమాండ్ మేరకు సరఫరా ఉండాలి కానీ..మాకు నచ్చిన ...మాకు డబ్బులిచ్చిన వాళ్ళ బ్రాండ్స్ మాత్రమే మేము ఎక్కువ అందుబాటులో పెడతాం అంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెపుతున్నారు. దేశంలోని టాప్ టెన్ బీర్ బ్రాండ్స్ లో కింగ్ ఫిషర్, కార్ల్స్ బెర్గ్, బడ్ వైజర్, హెయిన్ కెన్ , కరోనా, బిరా 91 , ఫాస్టర్స్ , హాయీగార్డెన్ లు ఉన్నాయి. విచిత్రం ఏమిటి అంటే డిమాండ్ ఉన్న బీర్లను పక్కన పెట్టి కొత్త కొత్త బ్రాండ్స్ ను మందు బాబులపై రుద్దటం అంటే దీని వెనక భారీ ప్రయోజనాలే ఉన్నాయని చెపుతున్నారు. తెలంగాణ లో కొత్త గా సోమ్ డిస్టలరీస్ కే కాకుండా టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎక్సోటికా తదితర బ్రాండ్స్ కు కూడా అనుమతులు మంజూరు చేశారు. తొలి విడతలో బీర్లతో స్టార్ట్ చేసిన వాళ్ళు తర్వాత ఇతర మద్యం కొత్త బ్రాండ్స్ పై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది అని చెపుతున్నారు.