బుల్డోజర్లతో ప్రగతి భవన్ అడ్డుగోడలు కూల్చివేత

Update: 2023-12-07 10:17 GMT

కెసిఆర్ ప్రభుత్వంలో అసలు సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం ఏముంది అనే సూత్రీకరణ తెరమీదకు తెచ్చారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పలు మార్లు బహిరంగంగానే ప్రకటించారు. కానీ అదే కెసిఆర్ ఓట్ల కోసం గత నెలలో ఏకంగా 96 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కానీ ప్రజలకు అవసరం అయినప్పుడు మాత్రం ఎప్పుడూ ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోలేదు. ప్రజలకే కాదు..చివరకు మంత్రులు..ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి అనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందుకు బిన్నంగా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఒక వైపు రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తుంటే..మరో వైపు కెసిఆర్ సీఎం గా ఉన్న సమయంలో ప్రగతి భవన్ చుట్టూ కట్టిన అడ్డు గోడలు...ఇనుప కంచెలను బుల్డోజర్స్ తో కూల గొట్టించారు.

అంతే కాదు...శుక్రవారం నాడు అక్కడే తాను ప్రజలను కలబోతున్నానని....ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలు అక్కడకు రావచ్చు అని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎల్ బీ స్టేడియం లో తొలి ప్రసంగం చేస్తూ రేవంత్ రెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. ప్రగతి భవన్ పేరును కూడా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా ప్రకటించారు. తాము పాలకులం కాదు...ప్రజలకు సేవకులం అన్నారు. అభివృద్ధి విషయంలో కూడా అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ ఇవ్వాలే వచ్చింది అని...ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని తెలిపారు. గత పదేళ్లుగా ప్రజలు నిరంకుశత్వాన్ని మౌనంగా భరించారు అన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా ఉంటుంది అని తెలిపారు.

                                          రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఎల్ బీ స్టేడియం లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లి కార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య ల సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణ రావు లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు...అమరవీరుల కుటుంబాల సభ్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు హాజరు అయ్యారు. 

Tags:    

Similar News