కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో రైతుల దగ్గర నుంచి వరి కొనకపోత టీఆర్ఎస్, బిజెపిలకు రైతులే ఉరి వేస్తారని హెచ్చరించారు. ధాన్యం రాశుల వద్ద ప్రాణాలు కోల్పోయిన రైతులకు కనీసం రైతు బీమా కూడా ఇవ్వటంలేదని ఆయన ఆరోపించారు. ధర్నా చౌక్ లో రైతులకు అండగా కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న కెసీఆర్ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయటంలేదని ప్రశ్నించారు. బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు తోడుదొంగలే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు తెచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్రంలో దాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని.బియ్యం ఎగుమతి చేస్తామని ప్రకటించారు. అంతే కాదు..500 రూపాయలు రైతులకు బోనస్ కూడా ఇస్తామని తెలిపారు. ఈ హామీని అమలు చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కేవలం ఎనిమిది లక్షల టన్నుల మాత్రమే ధాన్యం సేకరించిందని తెలిపారు. కేంద్రం 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కెసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. దసరా దీపావళి పండగలు చేసుకోకుండా రైతులు కల్లాల దగ్గర పడుకుంటున్నారని అన్నారు. పనికిరాని మంత్రులను తీసుకుని కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. మోడీ అపాయింట్ మెంట్ తీసుకోని కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లిండు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మానవత్వం లేదని, ధనార్జనే ఆయన ద్యేయమన్నారు. 20వేల కోట్లు పెడితే రైతుల ధాన్యం మొత్తం కొనొచ్చన్నారు. కేసీఆర్ పెద్ద మోసగాడు, కాళేశ్వరం పెద్ద గోల్ మాల్ అని విమర్శించారు. కేసీఆర్ నాలుక కోసినా తప్పులేదని, దళితులకు మూడెకరాల భూమి నేనెప్పుడూ ఇస్తా అన్న అంటున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దొంగల ముఠాలా మారి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.