కారణాలు ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కాలం కలిసి వస్తోంది. ఢిల్లీలో అధిష్టానం బలంగా ఉంటే ముఖ్యమంత్రులను సీట్లో ఎప్పుడూ కుదురుగా కుర్చోనివ్వదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే ఉంటారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇది సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఆయన టీం కు కొత్త జోష్ ఇచ్చినట్లు అయింది. మరో వైపు బీహార్ లో కాంగ్రెస్ కూటమి దారుణ ఓటమి చవిచూసింది. కర్ణాటకలో సీఎం సీటు పై పంచాయతీలు నడుస్తున్నాయి. మూడు టర్మ్ లు కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా మారింది. ఆ పార్టీ రాజకీయ ప్రణాళికలు మొత్తం పునర్ రచించుకుంటే తప్ప తిరిగి గాడిన పడే పరిస్థితి కనిపించటం లేదు. ఈ తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు అధికార పరంగా..ఆర్థికంగా మరింత బలోపేతం అయితే తమ ఉనికికే ప్రమాదం వస్తుంది అనే భయంతో ఆయన క్యాబినెట్ లోని కొంత మంది మంత్రులు కీలక సమాచారాన్ని మీడియాకు లీక్ లు ఇచ్చి ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చర్చ సాగుతోంది.
ముఖ్యంగా ఇటీవల తెలంగాణ సర్కారు తెర మీదకు తీసుకువచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) విధానం గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇది అంతా అనుకున్నది అనుకున్నట్లు పూర్తి అయితే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ని కట్టడి చేయటం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతోనే నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి ఈ మొత్తం వ్యవహారాలను గుట్టు చప్పుడు కాకుండా మీడియా కు లీక్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అత్యంత కీలకమైన సమాచారం క్యాబినెట్ తర్వాత..ముందు కూడా మీడియా కు లీక్ కావటం పై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. దీనిపై విచారణ కూడా సాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఆ సీనియర్ మంత్రి కీలక సమాచారాన్ని లీక్ చేసారు అనే విషయాన్ని కొంత మంది నేతలు ఇప్పటికి ఢిల్లీ కి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి దూకుడు నిర్ణయాలు...హిల్ట్ తెర వెనక ఉన్న ఆర్థిక ఎజెండా వంటి అంశాలను వివరిస్తూ ఇతర మంత్రులు కూడా ఒక రిపోర్ట్ ను ఢిల్లీకి పంపినట్లు చెపుతున్నారు. క్యాబినెట్ అంటే ఉమ్మడి గా కలిసి సాగాల్సిన వ్యవస్థ..అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో పరస్పర అపనమ్మకాలు దారుణంగా ఉన్నాయని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు అంటే పరిస్థితి ఎలా అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే మీడియా కు ..ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇస్తుండటంతో బిఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా హిల్ట్ వెనక పెద్ద స్కాం దాగి ఉంది అని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. మరి రాబోయే రోజుల్లో హిల్ట్ పాలసీ మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తుందా..లేక ఎందుకు వచ్చిన గొడవలే అని అందరూ సర్దుకుంటారా అన్నది వేచిచూడాలి. సీఎం రేవంత్ రెడ్డి కి ఇప్పుడు బయట ప్రతిపక్షాల కంటే ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రుల వలనే ఎక్కువ చిక్కులు వచ్చిపడుతున్నాయి అని మరి మంత్రి అభిప్రాయపడ్డారు.