గ్లోబల్ సమ్మిట్ యాడ్ లో కూడా మంత్రికి చోటు దక్కదా!

Update: 2025-12-08 05:00 GMT

ఫ్యూచర్ సిటీ ని షో కేసు చేస్తూ తెలంగాణ కు...ముఖ్యంగా హైదరాబాద్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ సదస్సు డిసెంబర్ 8 -9 తేదీల్లో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలా చూసుకున్నా కూడా ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మున్సిపల్ శాఖ తర్వాత ఇందులో అత్యంత కీలకమైనది పరిశ్రమల శాఖ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సదస్సు నిర్వహిస్తున్నదే ఫ్యూచర్ సిటీ లో అందుబాటులో ఉన్న భూమిని చూపించి పెట్టుబడులు సాధించటం..ప్రభుత్వం కల్పించబోయే సౌకర్యాల గురించి వివరించటం ఇందులో అత్యంత ప్రధానమైనది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి సోమవారం నాడు పత్రికల్లో తెలంగాణ సర్కారు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది. ఈ యాడ్స్ లో అంతా అట్టహాసంగా చూపించారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఇందులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫోటో లు పెట్టారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమిలేదు. కానీ ఈ గ్లోబల్ సదస్సులో అత్యంత కీలకమైన పరిశ్రమల శాఖ మంత్రి అయిన డి. శ్రీధర్ బాబు ఫోటో ను మిస్ కొట్టారు.

                                                        ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కు అవమానమే అనే చర్చ సాగుతోంది. ఈ తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కెసిఆర్ బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పెట్టుబడుల సాధన కోసం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తూ అందులో పరిశ్రమల శాఖ మంత్రి ఫోటో పెట్టకపోవడం ఏ మాత్రం సరికాదు అని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బిఆర్ఎస్ హయాంలో కూడా ఎక్కువ శాతం కెసిఆర్ ..లేదు అంటే కేటీఆర్ ఫోటోలు పెట్టేవారు తప్ప..ఇతర మంత్రులకు పెద్దగా చోటు కలిపించేవాళ్ళు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే మోడల్ ఫాలో అవుతున్నట్లు ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

                                              ఎలా చూసుకున్నా కూడా పరిశ్రమల శాఖ తో పాటు ఐటి శాఖ ను చూస్తున్న శ్రీధర్ బాబు ఈ సమావేశంలో ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు సీఎంఓ లో చక్రం తిప్పుతున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి డైరెక్షన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని అంతా నడిపిస్తున్నారు అని..అందుకే ఇందులో శ్రీధర్ బాబు కు అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. ఆ ఐఏఎస్ అధికారే బిఆర్ఎస్ హయాంలో అంతా నడిపించారు...ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారులో కూడా ఆయనదే హవా అన్న చర్చ సాగుతోంది.

                                             గత కొన్ని రోజులుగా తెలంగాణాలో రాజకీయంగా దుమారం రేపుతున్న హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్) విధానంలో కూడా ఆయనదే కీలక పాత్ర అని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. కీలక నేత...ఆ ఐఏఎస్ అధికారి తెర వెనక అంతా సిద్ధం చేసుకున్న తర్వాత విషయాన్ని బయటకు తెచ్చినట్లు ప్రచారం ఉంది. అదే సమయంలో కీలక నేత, ఆ సీనియర్ ఐఏఎస్ లు కలిసి చేస్తున్న వ్యవహారాలపై పలువు మంత్రులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత అయన వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది అనే చర్చ కూడా సాగుతోంది. ఢిల్లీ లో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉండటంతో రేవంత్ రెడ్డి లోని అసలు మనిషి బయటకు వస్తున్నట్లు ఉంది అని ఒక కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించటం విశేషం.

Tags:    

Similar News