అపోలో ఆస్పత్రిలో మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక నుంచి వీల్ చైర్ లో కొత్త డ్రామాలు మొదలుపెడతారు అంటూ హరీష్ వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. బిజెపి కూడా దీనిపై స్పందించింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో పొద్దున అల్లుడు, సాయంత్రం మామ ఆడిన డ్రామాలకే యువత బలయ్యారంటూ మండిపడ్డారు. మానవత్వం మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం హరీష్ రావుకే చెల్లిందని విమర్శించారు. ఈటెల కాలు ఆపరేషన్‌పై దిగజారి మాట్లాడటాన్ని హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తామని చెప్పారు.
డ్రామాకు పర్యాయపదమే టీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఎవరి భవిష్యత్ ఏంటో తెలుస్తుందన్నారు. కౌశిక్ రెడ్డికి ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసి ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు క్యాబినెట్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ..కేసీఆర్ ఇప్పించారా? లేదా అనేది కాలమే సమాధానం చెప్తోందన్నారు. హరీష్ రావు డ్రామాలకే శ్రీకాంతాచారి బలి అయ్యాడని ఆరోపించారు.