పుట్టా మధు అరెస్ట్

Update: 2021-05-08 08:58 GMT

పుట్టా మధు. గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా విన్పిస్తున్న పేరు. అంతే కాదు ఆయన అజ్ఞాతంలో వెళ్లటం కూడా పెద్ద సంచలనంగా మారింది. అసలు ఆయన అజ్ఞాతంలో ఉన్నారా?. లేక ఎవరైనా ఆయన్ను తీసుకెళ్ళారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే శనివారం నాడు రామగుండం పోలీసులు పుట్టా మధును పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఆయన్ను రామగుండం తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల ఆరోపణల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే మధు మాయం అయ్యారు.

ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండగా, పోలీసులు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్లలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. హైకోర్టు అడ్వకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్టా మధుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజులుగా అదృశ్యమవడానికి గల కారణాల గురించి మధును పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదులోని అంశాలపై మరొకసారి ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. పెద్దపల్లికి చెందిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శీనును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

Tags:    

Similar News