హైదరాబాద్ లో వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఓ భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. పోలీసులు ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని పిటీషన్ దాఖలు చేశారు. ఆమె బయటకు వస్తే సాక్ష్యులను బెదిరించే అవకాశం ఉందని..ఆమె ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. శనివారం నుంచి ఈనెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, అఖిలప్రియ భర్త సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు.
నిందితులను అరెస్ట్ చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందన్నారు. అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. ''సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాలి. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానికుల్లో అభద్రతాభావం నెలకొంది. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉంది. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే కేసు విచారణ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే అఖిలప్రియకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.