బండి సంజయ్ కు ప్రధాని మోడీ ఫోన్

Update: 2020-12-02 09:00 GMT

తెలంగాణలో బిజెపి అనూహ్యంగా దూకుడు పెంచింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు పలు వ్యూహాలు రచిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం ఆ పార్టీకి ఎక్కడలేని జోష్ తెచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే జోష్ ను చాటింది. ప్రచారంలో అందుకే ఎన్నడూలేని దూకుడు చూపించింది. అయితే ఓటింగ్ శాతం తగ్గటంతో పలితాలు ఎలా ఉంటాయన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే బిజెపి మాత్రం ఆశించిన ఫలితాలను సాధిస్తామని ధీమానే చూపుతోంది. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ కు ఫోన్ చేసి ఆరా తీయటం ప్రాధాన్యత సంతరించుకుంది. బండి సంజయ్ కు మోడీ ఫోన్ చేసిన విషయాన్ని తెలంగాణ బీజేపీ బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. 'తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల స్థితిగతులపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

దాదాపు 10 నిమిషాలపాటు, ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితులపై ప్రధాని ముచ్చటించారు. నాయకులు, కార్యకర్తలపైన జరిగిన దౌర్జన్యంపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని ప్రధాని మోదీ అభినందించారు. పార్టీని విజయతీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను మోదీ కొనియాడారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్‌ నడవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దైర్యంగా ముందుకు సాగాలని అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి' అని ప్రధాని మోదీ సూచించినట్లు తెలంగాణ బీజేపీ ఆ ప్రకటనలో పేర్కొంది.

Tags:    

Similar News