ప్రస్తుతానికి బీజేపీ, జనసేనలు పొత్తులో ఉన్నాకూడా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప..కలిసి ఉమ్మడిగా ఎలాంటి ప్రణాళికలు అమలు చేయటం లేదు. అదే సమయంలో కలిసి కార్యక్రమాలు చేయటానికి బీజేపీ ముందుకు రావటానికి సిద్ధంగా లేదు అని పవన్ స్పష్టంగా ప్రకటించారు. పవన్ మాటలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలవటం పక్కా అని స్పష్టం అవుతోంది. అయితే ఇక తేలాల్సింది సీట్ల లెక్కలు మాత్రమే. ఈ రెండు పార్టీల పొత్తు కుదరకుండా ఉండటానికి తెర వెనుక ఎవరు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ పొత్తుల రాజకీయ లెక్కలు తేలాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. కాకపోతే రాజకీయాల లైన్ల లో మాత్రం క్రమక్రమంగా స్పష్టత వస్తోంది. ఎన్నికల ముందు బీజేపీ తో కటీఫ్ చెప్పినా తన తప్పు ఏమీ లేదనే సంకేతాలు ఇవ్వటానికే...పవన్ జనసేన కీలక సభలో బీజేపీ స్టాండ్ ప్రజలకు వెల్లడించే ప్రయత్నం చేశారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ సర్కారుకు, సీఎం జగన్ కు అండగా కేంద్రంలోని బీజేపీ, మోడీ సర్కారు ఉంది అన్న ప్రచారం ఎప్పటినుంచో ఉన్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర నేతలు చెపితే రాష్ట్ర నాయకులు మాట వినకపోవడం అంటూ ఉండదు. కేంద్రంలోని పెద్దలే..పవన్ కు ఒకటి చెప్పి...రాష్ట్ర నాయకులకు మరో రకంగా చెప్పి ఉంటారు అనే అభిప్రాయం కూడా నేతల్లో ఉంది.