పది రోజులుగా ఫైలుపై స్పందించని గవర్నర్!
మహారాష్ట్రలో ఎనిమిది నెలలుగా 12 మంది ఎమ్మెల్సీల ఫైలు పెండింగ్
హుజూరాబాద్ కు చెందిన టీఆర్ ఎస్ నేత కౌషిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కథ కంచికి చేరినట్లేనా?. గవర్నర్ తమిళ్ సై సౌందరాజన్ ఈ ఫైలును పక్కన పెట్టేశారా?. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గోరెటి వెంకన్నను నియమించిన ఫైలు రాజ్ భవన్ కు అలా వెళ్లి ఆమోదంతో ఇలా వచ్చింది. కానీ కౌషిక్ రెడ్డి విషయంలో మాత్రం అలా జరగలేదు. తెలంగాణ మంత్రివర్గం ఆమోదం అనంతరం ఫైలు గవర్నర్ కు చేరి పది రోజులు కావస్తోంది. అయినా ఇప్పటివరకూ అది తిరిగి రాలేదు. దీంతో అసలు ఈ ఫైలు వస్తుందా..రాదా అన్న టెన్షన్ లో టీఆర్ఎస్ నేతలు, కౌషిక్ రెడ్డి ఉన్నారు. సహజంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లలో వివిధ రంగాల్లో నిష్ణాతులు అయిన వారినే ఎంపిక చేస్తుంటారు.. అయితే ఈ సంప్రదాయాలు ఎప్పుడో పక్కన పెట్టేసి వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఇవ్వాల్సిన ఈ సీట్లను కూడా రాజకీయ సర్దుబాట్లలో భాగంగా ప్రత్యక్ష్య రాజకీయాల్లో ఉన్న వారికే కట్టబెడుతున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా ప్రారంభం అయింది కాకపోయినా మరీ వివాదస్పదులు అయిన వారి విషయంలో మాత్రం రాజ్ భవన్ కు పిర్యాదు లు కూడా చేరుతుంటాయి. అసలు కౌషిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన రోజుల వ్యవధిలోనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సిఫారసు చేయటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. గవర్నర్ ఒక సారి తిప్పిపంపాక ప్రభుత్వం మళ్లీ కేబినెట్ ఆమోదంతో గవర్నర్ కు తిరిగి ఫైలు పంపిస్తే అది ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. అయితే దీనిపై నిర్ణయం తీసుకోకుండా ఎంత కాలం అయినా ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపినట్లు ద న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం వెల్లడించింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రంలో కూడా అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. ఇంకా అది అలా సాగుతూనే ఉంది కూడా.
మహారాష్ట్ర కేబినెట్ 12 మంది సభ్యులను కౌన్సిల్ కు నామినేట్ చేస్తూ తీర్మానం చేసి గవర్నర్ కు పంపింది. ఇది జరిగి ఎనిమిది నెలలు అవుతోంది. కానీ ఆ ఫైలు ఇంత వరకూ తిరిగి లేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఈ అంశంపై ముంబయ్ హైకోర్టును ఆశ్రయించింది. అంటే.. ఈ లెక్కన గవర్నర్ ఇలాంటి పైళ్ళపై నిర్ణయం తీసుకోవటానికి నిర్ధిష్ట సమయం అంటూ ఏమీలేదు. ఇదే ఆసరాగా తెలంగాణ గవర్నర్ కూడా ఈ ఫైలును పక్కన పెట్టేసినట్లే కన్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బిజెపి హూజూరాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే రాజకీయాల్లో నిన్నమొన్నటి వరకూ యాక్టివ్ గా ఉన్న వ్యక్తిని గవర్నర్ కోటా కింద నామినేట్ చేయటాన్ని కారణంగా చూపి జాప్యం చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే గవర్నర్ల నిర్ణయాలు వెనక కూడా రాజకీయ కోణాలు ఉంటున్న విషయాలు ఎన్నోసార్లు వెలుగుచూశాయి. ఏపీలో ఇటీవలే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల్లో యాక్టివ్ నేతలనే అక్కడి గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. మరి తెలంగాణలో గవర్నర్ అందుకు భిన్నంగా వ్యవరిస్తారా? ఆమోదించి పంపిస్తారా అన్నది తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.