తెలంగాణలోనూ ఆక్సిజన్ కొరత

Update: 2021-04-16 14:25 GMT

పెరుగుతున్న కరోనా కేసులకు కారణంగా తెలంగాణలో బెడ్స్ కొరత వేధిస్తుంటే..ఇప్పుడు ఆక్సిజన్ సమస్య కూడా జత చేరింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆక్సిజన్ కొరత అంశంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత వాస్తవమేనని.. అయితే కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గతంలో కంటే మరింత వేగంగా కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్లు ఈటల చెప్పారు. అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని.. కానీ హామీ మాత్రం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ విధించే ఆస్కారం లేదని మంత్రి స్పష్టం చేశారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

Tags:    

Similar News