తెలంగాణ బిజెపి అధ్యక్షడు బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పోటీ ప్రధానంగా ఎంఐఎంతోనే అన్నారు. హైదరాబాద్ మేయర్ పీఠం ఎంఐఎం పరం కాకుండా అడ్డుకుంటామని తెలిపారు. గ్రేటర్ పై బిజెపి జెండా ఎగరేస్తామని తెలిపారు. హైదరాబాద్ కు పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో మునిగిపోతే ప్రగతిభవన్ లోనే ఉన్న సీఎం కెసీఆర్ కనీసం బాధితులను పరామర్శించటానికి కూడా బయటకు రాలేదని విమర్శించారు. ఎంఐఎంతో కలసి టీఆర్ఎస్ పనిచేస్తోందని విమర్శించారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని..ఓట్లు అడగటానికి వస్తే ప్రజలు టీఆర్ఎస్ నాయకులను గల్లా పట్టుకుని ప్రశ్నించటానికి రెడీ అవుతున్నారని తెలిపారు. తాము మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి ఒంటరిగానే బరిలో నిలబడుతుందని తెలిపారు. బిజెపి అభ్యర్ధులను బుధవారం నాడు ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. దుబ్బాక ఫలితమే గ్రేటర్ లో కూడా రిపీట్ అవుతుందని తెలిపారు.