తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు
తెలంగాణ సర్కారులా పనిచేసి ఉంటే దేశ జీడీపీ మరింత పెరిగేది
టీఆర్ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రారంభోపన్యాసం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎవరూ బద్దలు కొట్టలేని కంచుకోట అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్... తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు. రాష్ట్రానికి టీఆర్ఎస్ రక్షణ కవచంలాంటిదన్నారు. దేశానికి రోల్ మోడల్ గా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందన్నారు. వెయ్యి కోట్ల రూపాయల ఆస్తితో ప్రస్తుతం పార్టీ ఉందన్నారు. కేంద్రం నుంచి పలు అవార్డులు..రివార్డులే టీఆర్ఎస్ సర్కారు సాధించిన ప్రగతికి నిదర్శనాలు అన్నారు. దేశంలోని పది ఉత్తమ పంచాయతీల్లో పదికి పది తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. తెలంగాణలో అడ్డదిడ్డమైన వ్యవహారాలు లేవని అన్నారు. కర్ణాటకలో ఓ మంత్రి అవినీతి ఆరోపణలతో కూరుకుపోయి మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. ధరణి పోర్టల్ చూసి దేశమే ఆశ్చర్యపోతుందని..ఎలాంటి అవినీతి లేకుండా చేశామని తెలిపారు. ఏ రంగం తీసుకున్నా..ఏ విషయం తీసుకున్నా ఇతరులకు ఆదర్శంగా ఉన్నామన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం అని ప్రశంసించారు. పలు కీలక రాష్ట్రాలను అధిగమించి 2.70 లక్షల తలసరి ఆదాయం సాధించుకున్నామని తెలిపారు. మనం పండించే ధాన్యాన్ని కొనలేని ఆశక్తతను కేంద్రం వ్యక్తం చేసింది అంటే మనం ఎక్కడికి ఎదిగామో ఆలోచించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన స్థాయిలో కేంద్రం పనిచేసి ఉంటే దేశ జీడీపీ ఇంకా ఎంతో మెరుగ్గా ఉండేదన్నారు. తెలంగాణ పనిచేసిన తరహాలో కేంద్రం పనిచేయటం లేదన్నారు. దేశంలో ఇటీవల కాలంలో జాడ్యాలు..పెడధోరణులు వస్తున్నాయి..ఇది భారత సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇంత అద్భుతమైన దేశంలో దుర్మార్గమైన, సంకుచితమైన విధానాలు తీసుకొస్తున్నారు కొంత మంది. దేశ అభ్యున్నతికి ఓ నిర్ణయం తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ కోతలతో చుట్టూ ఉన్న రాష్ట్రాలు అంథకారంలో ఉంటే..తెలంగాణ మణిదీపంలా వెలుగుతూ ఉందని వ్యాఖ్యానించారు.