కెసీఆర్ ఢిల్లీకి..నిమ్స్ డైర‌క్ట‌ర్ అపోలో ఆస్ప‌త్రికి!

Update: 2022-09-07 09:50 GMT

Full Viewతెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత వైద్య రంగం ఎంతో ప్ర‌గ‌తి సాధించింది. ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చాం. ఇదీ సీఎం కెసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావులు నిత్యం చెప్పేమాట‌. కానీ సీఎం కెసీఆర్ కు కంటి నొప్పి..పంటి నొప్పి అయినా ఢిల్లీలోనే వైద్యం చేయించుకుంటారు. ఇత‌ర స‌మ‌స్య‌లు అయితే న‌గ‌రంలోని య‌శోదా ఆస్ప‌త్రికి మాత్ర‌మే వెళ‌తారు. ఎన్ని మాట‌లు చెప్పినా ప్ర‌భుత్వ ఆస్పత్రుల‌పై...ప్ర‌భుత్వ వైద్యంపై వారికే న‌మ్మకం పుట్ట‌ద‌న్న‌మాట‌. ఇప్పుడు నిమ్స్ డైర‌క్ట‌ర్ వ్య‌వ‌హారం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. నిమ్స్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ మ‌నోహ‌ర్ కు గుండెపోటు రావ‌టంతో ఆయ‌న న‌గ‌రంలోని అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. నిమ్స్ మ‌ల్టీస్పెషాలిటీ ఆస్ప‌త్రి. ఇందులో కీల‌క విభాగాలు అన్నీ ఉన్నాయి.

నిమ్స్ డైర‌క్ట‌ర్ అంటే అత్యంత కీల‌క‌మైన పోస్టు. చివ‌ర‌కు ఆయ‌నే తాను సార‌ధ్యం వ‌హిస్తున్న ఆస్ప‌త్రిలో కాకుండా ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకోవ‌టం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఇది ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కు పెద్ద మ‌చ్చ‌గా మిగిలిపోతుంద‌ని అధికార వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ వార్త సోష‌ల్ మీడియాలో పెద్ద వైర‌ల్ గా మారింది. ప్ర‌భుత్వంపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిమ్స్ ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌టంలేద‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన కుని ఆప‌రేష‌న్లు విక‌టించి కొంత మంది మ‌హిళలు మ‌ర‌ణించ‌టం పెద్ద దుమార‌మే రేపింది. గ‌తంలోనూ వైద్య ఆరోగ్య శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారి ఒక‌రు కోవిడ్ కు కూడా ఓ ప్ర‌ముఖ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. రాష్ట్రంలో ఇక అస‌లు ఏ రంగంలో స‌మ‌స్య‌లు లేవు..ఇక దేశం వైపు ఫోక‌స్ పెడతా అని సీఎం కెసీఆర్ చెబుతున్న త‌రుణంలో వ‌ర‌స ఘ‌ట‌న‌లు ప్ర‌భుత్వ డొల్ల‌త‌నాన్ని తెలియ‌చేస్తున్నాయ‌ని అధికార వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Tags:    

Similar News