రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ
అత్యవసర సేవలకు మినహాయింపు
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో సర్కారు రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకూ వరకూ రాత్రి కర్ఫ్యూ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రాత్రి నుంచే ఇది అమల్లోకి రానుంది. దేశ వ్యాప్తంగా..రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ సమయంలో అన్ని ఆఫీసులు, షాప్ లు, రెస్టారెంట్లు 8 గంటలకు మూసివేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆస్పత్రులు, డయాగ్నిస్టిక్ సెంటర్లు, ల్యాబ్ లు, ఫార్మసీలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వారిని కర్ఫ్యూ నుంచి మినహాయింపు కల్పించారు. మినహాయింపు పొందిన వాటిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఈ కామర్స్ ద్వారా అన్ని వస్తువులు సరఫరా చేసే వారు, పెట్రోల్ పంపులకు మినహాయింపులు ఇచ్చారు. మిగిలిన అందరికీ నిషేధం అమల్లో ఉంటుంది. అంతర్ రాష్ట్ర, రాష్ట్రంలో వాహనాల కదలికలపై మాత్రం ఎలాంటి నిషేధాలు ఉండవు. రాత్రి కర్ఫ్యూ సమయంలో అనుమతించిన వరకూ మాత్రమే ప్రజా రవాణాతోపాటు ఆటోలు, క్యాబ్ లను అనుమతిస్తారు.