కెసిఆర్, కేటీఆర్ ఇప్పుడేమి చెపుతారు

Update: 2023-11-03 08:54 GMT

మేడిగడ్డ మొత్తం మళ్ళీ కట్టాల్సిందే

ఇప్పుడు అది నీళ్లు నింపటానికి పనికిరాదు

అన్నారం, సుందిళ్ల కు డేంజర్

డిజైన్ల లోపం...నిర్వహణ గాలికి

హెచ్చరించినా పట్టించుకోని తెలంగాణ సర్కారు

ఎన్ డి ఎస్ ఏ నివేదికలో బయటపడ్డ వాస్తవాలు

అవినీతి ఒకటి. పోనీ అవినీతి జరిగినా ప్రాజెక్ట్ అయినా సరిగా కట్టారా అంటే అది కూడా లేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డి ఎస్ ఏ) వెల్లడించిన విషయాలు తెలంగాణ ప్రజలనే కాదు...దేశ ప్రజలను కూడా షాక్ కు గురి చేసేలా ఉన్నాయని చెప్పొచ్చు. కాళేశ్వరం ను ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ గా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు ప్రచారం చేసుకున్నారు. దీనికి సంబంధించి లోపాలు బయటపడుతున్నా కూడా కాళేశ్వరం జోలికి వస్తే సహించేది లేదు అని తాజాగా మంత్రి కేటీఆర్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంత పెద్ద ఇంజనీరో..తెలంగాణ పునర్నిర్మాణ కర్తో ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక బహిర్గతం చేస్తోంది. నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం అంటే కెసిఆర్ ...కెసిఆర్ అంటే కాళేశ్వరం అంటూ ప్రకటనలు కూడా చేశారు. సీఎం కెసిఆర్ అయితే వేయి అడుగులు ముందుకు వేసి ఈ మధ్య అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన డబ్బులు కూడా వచ్చాయని ప్రకటించిన సంగతి తెలిసింది. దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దారుణ ఉల్లంఘనలు..డిజైన్ లోపాలు ఉన్నాయని..డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. మరి ఇప్పుడు సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లు దీనికి అధికారులను బాద్యులు చేస్తారా...లేక వాళ్లే బాధ్యత తీసుకుంటారా అన్నది వేచిచూడాలి. ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటి అంటే మేడిగడ్డలో చోటు చేసుకున్న పరిణామాలు తర్వాత కేంద్రం మొత్తం 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరగా..రాష్ట్ర ప్రభుత్వ మాత్రం కేవలం పదకొండు అంశాలపై మాత్రం వివరాలు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీని ఆధారంగా నివేదిక సిద్ధం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే సమయంలో సరైన అధ్యయనం చేయకుండా ఉండటం ఒకటి అయితే ...సరైన ప్లానింగ్, డిజైన్ లు సరిగా లేకపోవటమే ప్రస్తుత ఈ పరిస్థితి కి కారణం అని స్పష్టం చేశారు. అంతే కాదు...క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్సు కూడా సరిగా లేవు అని తేల్చారు.    మేడిగడ్డ బ్యారేజ్ ప్లానింగ్ , డిజైనింగ్ లోపాల కారణముగా మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి అని తెలిపారు. బ్యారేజ్ కి సరైన ఫౌండేషన్ వేయలేదు అని..బ్యారేజ్ లోడ్ తట్టుకునేలా నిర్మాణం సాగలేదు అని వెల్లడించారు 2019 లో బ్యారేజ్ ప్రారంభం అయినప్పటి నుంచి ప్రభుత్వం సిమెంట్ కాంక్రీట్ బ్లాక్ ను నిర్వహణ చేయలేదు అని..కనీసం అక్కడి పరిస్థితిని తనిఖీ చేయలేదు అని నివేదికలో పేర్కొన్నారు. ఈ నిర్వహణ లోపం కూడా డ్యామ్ దెబ్బతినే స్థితికి వచ్చింది అని వెల్లడించారు. ఇది కూడా ఒక పెద్ద వైఫల్యంగా తేల్చారు.

                            ఎన్ డి ఎస్ ఏ తరచూ తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని వర్షాలకు ముందు...వర్షాల తర్వాత అక్కడ ఉండే ఒత్తిడి..ఏమైనా అసాధారణ పరిస్థితులు ఉన్నాయేమో చూడాల్సిందిగా కోరినా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు అని తెలిపారు. ఇది దారుణమైన ఉల్లంఘన అని తేల్చారు. నిర్వహణ లోపం వల్ల తలెత్తిన ఒత్తిడి కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7 దగ్గర ప్రతికూల పరిస్థితి తలెత్తడానికి కారణం అయింది అని తేలింది. మేడిగడ్డ బ్యారేజ్ ను పూర్తిగా పునరుద్దరించే వరకు ఇది నిరుపయోగమే అని తేల్చారు. బ్లాక్ 7 రిపేర్లు చేయటం కుదరదు అని...పునాది నుంచి మళ్ళీ నిర్మించిన తర్వాతే దీన్ని ఉపయోగించ వచ్చు అని తెలిపారు. ఇదే పరిస్థితి మొత్తం బ్యారేజ్ లో ఉంటుంది కనుక...మొత్తం బ్యారేజ్ నే తిరిగి కట్టాల్సి ఉంటుంది అన్నారు. ప్రస్తుతం ఉన్న స్థితిలో రిజర్వాయర్ లో నీళ్లు నింపటం బ్యారేజ్ కు ముప్పు అని తేల్చారు. అప్పటివరకు నీళ్లు నింపవద్దు అని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా కట్టిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే తరహా డిజైన్లు, నిర్మాణ పద్ధతులు అనుసరించినందున అవి కూడా ఇదే తరహా ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొనే అవకాశం ఉంది అని తేల్చారు. అన్నారం బ్యారేజ్ దగ్గర ఇప్పటికే బుంగలు ఏర్పడటం కూడా ఇదే సంకేతాలను పంపుతుంది అని నివేదికలో ప్రస్తావించారు. వీటిని కూడా తక్షణమే పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఎన్ డిఎస్ ఏ రిపోర్ట్ బిఆర్ఎస్ ను, కెసిఆర్, కెటిఆర్ లను మరింత ఇరకాటంలో పెట్టడం ఖాయం. ఎన్నికల ముందు వచ్చిన ఈ రిపోర్ట్ బిఆర్ఎస్ కొంప ముంచే అవకాశాలు కూడా లేకపోలేదు. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం మళ్ళీ కట్టడం అంటే మాములు విషయం కాదు.

Tags:    

Similar News