ఇది షెడ్యూల్ ప్రకారం వచ్చిన పరీక్ష కాదు. సంప్లిమెంటరీ కూడా కాదు. కావాలని తప్పి పరీక్ష రాసుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెచ్చుకున్న పరీక్ష. ఆ పరీక్ష తేదీ ఫిక్స్ అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పైకి చెబుతున్న కారణం నియోజకవర్గం అభివృద్ధి అంటున్నా...అసలు కారణాలు వేరే ఉన్నాయని అటు అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందరి కంటే రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డికి ఇది అత్యంత కీలకమైన పరీక్ష. గెలిస్తే ఓకే..తేడా వస్తే మాత్రం రాజకీయంగా దెబ్బే. అధికార టీఆర్ఎస్ ఈ సీటును దక్కించుకుని సత్తా చాటాలని చూస్తోంది. కొత్తగా పెట్టబోయే బీఆర్ఎస్ కు మునుగోడు నుంచే శ్రీకారం చుట్టాలనే యోచనలో ఆ పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అప్పటికి పేరు మార్పుకు సంబంధించి సీఈసీలో లాంఛనాలు పూర్తి కావటం అనుమానమే. ఏది ఏమైనా తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయింది. కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణాలో ఖాళీగా ఉన్న మనుగోడు ఉప ఎన్నికకు సోమవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 3 న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 6 న ఓట్ల లెక్కింపు చేస్తారు. ఈ నెల 7 న నోటిఫికేషన్ జారీ కానుంది..14 న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయితే..15 న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ రావటంతో మునుగోడు రాజకీయం మరింత వేడెక్కటం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే బిజెపి అభ్యర్ధి రాజగోపా్ల్ రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ కూడా గతానికి భిన్నంగా ఈ సారి కాస్త ముందుగానే పాల్వాయి స్రవంతిని తమ తరపున బరిలోకి దింపనుంది. ఇక టీఆర్ఎస్ పార్టీనే అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది. ఇది అంతా ఒకెత్తు అయితే ఇటీవల వరకూ కాంగ్రెస్ తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందనే చెప్పొచ్చు. ఆయన పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేక సోదరుడి కోసం ఆయన కూడా బిజెపిలోకి వెళతారా అన్నది తేలొచ్చు. షెడ్యూల్ రాకతో హడావుడి ప్రారంభం కావటం ఖాయం. అయితే హుజూరాబాద్ పై పెట్టిన అంత ఫోకస్ టీఆర్ఎస్ ఇక్కడ పెట్టినట్లు కన్పించటం లేదు. ఈటెల రాజేందర్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోల్చలేము కూడా. ఈ కారణంగానే టీఆర్ఎస్ హడావుడి చేయకుండా తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నట్లు కన్పిస్తోంది.